చికిత్సలో వైద్యుల రాజకీయాలు

 

మరో నెల రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. డెమోక్రెటిక్‌ పార్టీ తరఫు నుంచి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్‌ పార్టీ తరఫు నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుని పీఠం మీద కూర్చునేందుకు పోటీ పడుతున్నారు. ప్రతి నాలుగేళ్లకి ఓసారి ఈ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఈసారి మాత్రం ఎన్నడూ లేనంత ఉత్కంఠత నెలకొంది. ట్రంప్‌ తన వ్యాఖ్యలతో ఈ ఆసక్తిని మరింతగా రెచ్చగొడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘వైద్యుల రాజకీయ భావాలకీ, వారు చేసే చికిత్సకీ మధ్య ఏమన్నా సంబంధం ఉందా!’ అనే కోణంలో ఒక పరిశోధన జరిగింది. వినడానికి ఆశ్చర్యంగా కనిపించినా, పరిశోధన ఫలితాలు మాత్రం ఆలోచింపచేసేవిగానే ఉన్నాయి.

 

వైద్యుల నేపథ్యం

యేల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన హెర్ష్‌ అనే ఆచార్యుడు ఈ పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీకి విధేయంగా ఉండే ఒక 20,000 మంది వైద్యులను గుర్తించారు. వీరిలో 1,529 మందికి కొంతమంది రోగులకు సంబంధించిన రిపోర్టులను పంపించి వాటి మీద తమ అభిప్రాయాన్ని చెప్పమన్నారు. ఫలానా స్త్రీ గత ఐదేళ్లలో రెండు అబార్షన్లు చేయించుకుంది, ఫలానా రోగి ఊబకాయంతో బాధపడుతున్నా కూడా తగిన వ్యాయామం చేయడం లేదు... వంటి రకరకాల సమస్యలను వారి ముందు ఉంచారు. ప్రతి సమస్యకీ ఒకటి నుంచి పది పాయింట్లను కేటాయించి వాటి తీవ్రతని బట్టి పాయింట్లను కేటాయించమని అడిగారు. దాదాపు 300 మంది వైద్యులు ఈ సర్వేకు స్పందించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.

 

తేడాలు బయటపడ్డాయి

అబార్షన్ విషయంలో రిపబ్లికన్‌ వైద్యలు చాలా తీవ్రంగా స్పందించారు. అవి మానసికంగానూ, శారీరికంగానూ రోగి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మారిజోనా అనే మత్తుపదార్థపు వాడకాన్ని కూడా వారు తీవ్రంగా వ్యతిరేకించారు. మరో వైపు ఇళ్లలో తుపాకులను ఉంచుకోవడం, విచ్చలవిడిగా లైంగిక చర్యలకు పాల్పడటం వంటి అంశాల మీద డెమోక్రేట్ వైద్యులు తీవ్రంగా స్పందించారు. కాకపోతే రోజువారీ సమస్యలైన ఊబకాయం, త్రాగుడు, సిగిరెట్‌ వాడకం, హెల్మెట్‌ వంటి విషయాల్లో ఇద్దరి స్పందనా ఒకేలా కనిపించింది. మరో మాటలో చెప్పాలంటే నైతికతకి సంబంధించిన విషయాలుగా భావించే అబార్షన్, మత్తుపదార్థాలు, తుపాకులు, లైంగిక స్వేచ్ఛ వంటి అంశాల మీద ఇరుపార్టీలకు చెందిన వైద్యులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వైద్యుల మతం, ప్రాంతం, వయస్సులకు అతీతంగా ఈ తేడాలు బయటపడ్డాయి.

 

కారణం

సాధారణంగా నైతికతకి సంబంధించిన సమస్యల మీద ఒకో రాజకీయ పార్టీ ధోరణి ఒకోలా ఉంటుంది. ఆ పార్టీ విధేయుల మీద కూడా ఈ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వైద్యలు కూడా ఈ ధోరణికి అనుగుణంగా ప్రవర్తించడం ఆశ్చర్యపరిచే అంశమే! ‘వైద్యులు కేవలం రోగలక్షణాల ఆధారంగా యాంత్రికంగా వైద్యాన్ని అందిస్తారని మనం అనుకోవడానికీ లేదనీ, వారి వ్యక్తిగత అభిప్రాయాలు వారు అందించే చికిత్స మీద కూడా ప్రభావం చూపుతాయనీ’ అంటున్నారు హెర్ష్‌. వైద్యులకు శిక్షణని అందించేటప్పుడు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అభ్యర్థిస్తున్నారు. అవసరం అనుకుంటే రోగులు కూడా వైద్యుల రాజకీయ నేపథ్యాన్ని గమనించాలని సూచిస్తున్నారు. వివిధ నైతిక సమస్యల మీద ఒకో రాజకీయ పార్టీ ఒకో అభిప్రాయానికి కట్టుబడి ఉన్న మన దేశానికి కూడా ఈ పరిశోధన వర్తిస్తుందేమో ఎవరన్నా విశ్లేషిస్తే బాగుండు.

 

- నిర్జర.