బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు.. ఎనిమిది మంది మృతి
posted on Apr 13, 2025 10:20PM
.webp)
బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన పేలుడులో ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ ఘటన స్థలానికి వెళ్లి నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హోంమంత్రి అనితతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతులను... కైలాసపట్నంకు చెందిన అప్పికొండ తాతబాబు (50), సంగరాతి గోవింద్ (40), దేవర నిర్మల (38), పురం పాప (40), గుప్పిన వేణుబాబు (34)... భీమిలికి చెందిన హేమంత్ (20), రాజుపేటకు చెందిన దాడి రామలక్ష్మి (35), చౌడువాడకు చెందిన సేనాపతి బాబూరావు (55)గా గుర్తించారు. ప్రమాద సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో 15 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. హోంమంత్రి అనిత సంఘటనా స్థలానికి వెళ్లి స్థానికులు, అధికారులతో మాట్లాడారు. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 15లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారని అనిత చెప్పారు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారనీ, ఏడుగురు గాయపడ్డారనీ తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.