జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వంశీ
posted on Apr 13, 2025 12:12PM

వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కర్పొరేటర్లు ఒక్కరొక్కరుగా జారిపోతున్నారు. తాజాగా వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశి జనసేన గూటికి చేరారు. 74 వ వార్డు కార్పొరేటర్ గా కొనసాగుతున్న వంశీ వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు. తిప్పలనాగిరెడ్డి తొలి దశ నుంచి వార్డు అభివృద్ధిపై తమకు నిధులు కేటాయించడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. నిధుల కేటాయింపు విషయమై వంశీ కౌన్సిల్లో పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజాగా జీవీఎంసీ లో మేయర్ పీఠాన్ని మార్చే క్రమంలో కూటమి నాయకులు జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 19న చర్చ జరగనుంది. ఈ దశలో వంశీ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరడం నిస్సందేహంగా జగన్ పార్టీకి బిగ్ షాక్. నిజానికి మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి 74 మంది సభ్యుల అవసరం ఇప్పటికే కూటమికి 70 మంది సభ్యులు సహకారం ఉంది వీరితో పాటు మరో ఐదు వైసీపీ సభ్యులు తమతో టచ్ లో ఉన్నారని పలు సందర్భాల్లో కూటమి నేతలు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగానే వంశీ పార్టీ మారడంతో వైసీపీ వర్గాల్లో నిరుత్సాహం వ్యక్తమౌతోంది. ఇప్పటికే కార్పొరేటర్లు జారిపోకుండా శ్రీలంకలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ రకంగా పార్టీ కార్పొరేటర్లు జారిపోడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. తాజాగా తిప్పల వంశీ మాజీ మంత్రి జనసేన నాయకుడు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో జనసేనలో చేరారు. వార్డు అభివృద్ధి విషయంలో వివక్ష కారణంగా వంశీ పార్టీ మారినట్లు ఆయన అనుచరులకు చెబుతున్నారు.