1,128 ఆస్తులు..  8,088 ఎకరాలు! టీటీడీ ఆస్తులపై తొలిసారి శ్వేతపత్రం..

తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో తొలిసారిగా ‘శ్వేతపత్రం విడుదలైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులపై పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల కావడం ఇదే మొదటిసారి. శ్రీవారి ఆస్తులపై ఇంత వరకూ శ్వేతపత్రమూ విడుదల కాలేదు. శ్రీవారికి ఉన్న ఆస్తుల గురించి ప్రజలకు పూర్తిగా తెలియజేయాల్సిన బాధ్యత ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భావించింది. శ్రీనివాసుడికి భక్తులు సమర్పించిన కానుకలపై పారదర్శకంగా వ్యవహరించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ శ్వేతపత్రాన్ని టీటీడీ విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ శ్వేతపత్రం విడుదల చేశారు. దీంతో శ్రీవారి ఆస్తులపై గతంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన వివాదానికి టీటీడీ పాలక మండలి చెక్ పెట్టినట్టయింది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఈ శ్వేతపత్రం రూపొందించినట్లు చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న మొత్తం 1,128 ఆస్తులు ఉన్నాయి. మొత్తం 8,088 ఎకరాల 89 సెంట్ల వ్యవసాయ భూమి శ్రీవారికి ఉంది. దీన్ని వ్యవసాయం, వ్యవసాయేతర భూములు స్థలాలుగా విభజించింది. వ్యవసాయ అవసరాల కోసం వినియోగిస్తున్న ఆస్తుల సంఖ్య 233. వీటిలో 2,085 ఎకరాలు 41 సెంట్ల భూమి స్వామివారి పేరు మీద ఉంది. వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య 895. ఈ కేటగిరీలో ఉన్న స్థలాలు 6,003 ఎకరాల 48 సెంట్లు ఉన్నట్లు టీటీడీ శ్వేతపత్రంలో పొందుపరిచింది.

1974 నుంచి 2014 వరకు మొత్తం శ్రీవారికి చెందిన 141 ఆస్తులను విక్రయించినట్లు టీటీడీ అధికారులు శ్వేతపత్రంలో స్పష్టం చేశారు. మొత్తం 335 ఎకరాల 23 సెంట్ల స్థలాన్ని అమ్మినట్లు పేర్కొన్నారు. ఇందులో వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే ఆస్తుల సంఖ్య 61. వాటిలో మొత్తం 293 ఎకరాల 02 సెంట్లను అమ్మేశారు. 42 ఎకరాల 21 సెంట్ల వ్యవసాయేతర ఆస్తులను విక్రయించారు. దీనివల్ల టీటీడీ పాలక మండలికి 6 కోట్ల 13 లక్షల రూపాయల ఆదాయం వచ్చిట్లు శ్వేతపత్రం పేర్కొంది.

కాగా.. గత ఏడాది నవంబర్ 28 వరకు మదింపు చేసిన ఆస్తుల సంఖ్య 987. వాటిలో 7,753 ఎకరాల 66 సెంట్లు టీటీడీ ఆధీనంలో ఉన్నాయి. ఇందులో 172 వ్యవసాయ అవసరాలకు వినియోగించే భూమి ఉంది. మొత్తం 1,792 ఎకరాల 39 సెంట్ల వ్యవసాయ భూమి ప్రస్తుతం పాలక మండలి ఆధీనంలో ఉంది. 5,961 ఎకరాల 27 సెంట్ల వ్యవసాయేతర స్థలాలు టీటీడీ వద్ద ఉన్నాయి. ఈ వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి శ్వేతపత్రాన్ని www.tirumala.orgలో అందుబాటులో ఉంచినట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు