ఉచిత బియ్యం ఇక సగమే.. రాష్ట్రం వాటా లేనట్లే 

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపధ్యంగా 2021 ఏప్రిల్‌ నుంచి నవంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం  ఐదు కిలోలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు కిలోలు, మొత్తం పది కిలోల వంతున బీపీఎల్ రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా ఉచిత బియ్యం పంపిణీ జరిగింది. కానీ, రాష్ట్రంలోని  రేషన్ షాపుల్లో డిసెంబర్ లో 5 కిలోల బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఇదేమిటని, ఆరా తీస్తే, కేంద్ర ప్రభుత్వం నవంబర్ తో ముగిసిన గరీబ్‌ కల్యాణ్‌ యోజనను వచ్చే సంవత్సరం  మార్చి వరకు పొడిగించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అందుకే కేంద్ర ఇచ్చే ఐదు కిలోల ఉచిత బియ్యం మాత్రమే పేదలకు అందుతోంది. రాష్త్రం వాటా నిలిచి పోయింది. 

ఇందుకు  సంబందించి రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదని, బియ్యం కూడా విడుదల కాలేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన కోటా మేరకు 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని రేషన్ డీలర్లు చెపుతున్నట్లు సమాచారం. కిందటి నెల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి తెల్ల రేషన్ కార్డు ఉన్న ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం ఇవ్వగా.. ఇప్పుడు రాష్ట్రం వాటా ఇవ్వకపోవడంతో 5 కిలోలే పంపిణీ చేస్తున్నారు, దీంతో  పేద ప్రజలు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.  

ప్రస్తుత పరిస్థితులను బట్టి పేదలను ఆదుకునేందుకు కేంద్రం ఉచిత రేషన్‌ అందిస్తుంటే.. దానికి భిన్నంగా రాష్ట్ర సర్కారు రేషన్‌లో కోత పెట్టింది. ఈ నెలలో కేంద్రం ఇచ్చిన 5 కిలోల బియ్యమే పంపిణీ చేయాలని సివిల్‌ సప్లయ్స్‌ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఈ నెల లబ్ధిదారులకు ఉచితంగా అందాల్సిన రాష్ట్ర ప్రభుత్వ వాటా 2.8 లక్షల టన్నుల ఉచిత బియ్యం పంపిణీ నిలిచిపోయినట్లయింది.

తెలంగాణలో మొత్తం 90,48,421 రేషన్ కార్డులుండగా.. అందులో 2,87,44,273 మంది లబ్ధిదారులున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వాటా కింద ఇస్తున్న ఉచిత బియ్యానికి ప్రతి నెలా రూ. 110 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్రం వాటాను ఆపేయడంతో నెలనెలా రూ.110 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతాయి. అయితే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం పేదల కడుపు నింపే విషయంలో ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నిస్తున్నారు.