వైకుంఠద్వార దర్శనాల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు!

తిరుమలలో  భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం సులభ తరం చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. ఈ నెల 10 నుంచి 19 వరకూ భక్తులకు వైకుంఠద్వార దర్శనం కోసం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందు కోసం ఈ నెల 9 నుంచి తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే ఈ నెల 10 నుంచి 19 వరకూ శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శించుకోవచ్చు కనుక తొలి మూడు రోజులలోనే స్వామి వారిని దర్శించుకోవాలన్న ఆతృత వద్దనీ, తొక్కిసలాటకూ, తోపులాటలకూ తావు లేకుండా భక్తులు సహకరించాలని టీటీడీ చైర్మన్ విజ్ణప్తి చేశారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ, సామాన్య భక్తులకు శ్రీఘ్రంగా దర్శనం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 

మరోవైపు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న అంచనాలతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ట్రాఫిక్, పార్కింగ్ తదితర విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఉండేందుకు  టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. 

అలాగే తిరుమలలో భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నిబంధనలకు అనుగుణంగా ధరలు, ఆహార పదార్థాల నాణ్యత ఉండాలని ఆదేశించారు. పరిశుభ్రత విషయంలో కచ్చితంగా ఉండలని నిర్దేశించారు.  భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.