శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం
posted on Dec 4, 2025 8:50PM
.webp)
తిరుమల శ్రీవారి అలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.
ఆతర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల నడుమ వేద మంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు.
శ్రీవారి ఆలయంలో కార్తీకదీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది.
ఈ కార్తీకదీపోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి,
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకి దేవి, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ లోకనాథం, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.