శంషాబాద్ విమానా శ్రయంలో అయ్యప్పల ఆందోళన
posted on Dec 5, 2025 9:33AM

హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ నుంచి కొచ్చికి వెళ్లాల్సిన ఇండిగో విమానం 12 గంటలకు పైగా ఆలస్యం కావడంతో ఆ విమానంలో ప్రయాణించాల్సిన ఉన్న అయ్యప్ప భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. గురువారం (డిసెంబర్ 4) సాయంత్రం బయలు దేరాల్సిన ఈ విమానం శుక్రవారం (డిసెంబర్ 5) ఉదయానికి కూడా బయలుదేరకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విమానం జాప్యంపై ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో అయ్యప్ప స్వాములు ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే స్వాములు బోర్డింగ్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. తమ ప్రయాణానికి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గంటల తరబడి వేచిచూడాల్సి రావడం, సరైన సమాచారం ఇవ్వకపోవడం, అలాగే భోజనం–వసతి వంటి సౌకర్యాలు కూడా కల్పించకపోవడంపై అయ్యప్పస్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.