సునామీ క‌ల్లోలం.. ప‌సిఫిక్ తీరంలో టెన్ష‌న్ టెన్ష‌న్‌...

తెలుగు రాష్ట్రాల్లో అకాల‌ వ‌ర్షాలు కురుస్తున్నాయి. సంక్రాంతికి వాన‌లు ఏంటా అని అంతా హైరానా ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో సునామీ హెచ్చ‌రిక‌ల‌నే వార్త మ‌రింత షాకింగ్‌గా మారింది. అయితే, ఆ సునామీ వార్నింగ్ మ‌న‌కు కాదులేండి. మ‌న వాళ్లు ఎక్కువ సంఖ్య‌లో ఉండే విదేశాల‌కు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జ‌పాన్‌తో స‌హా ప‌సిఫిక్ తీర ప్రాంతం మొత్తాన్నీ సునామీ అల‌లు ముంచెత్తాయి. తీవ్ర న‌ష్టాన్ని మిగిల్చాయి. అందుకు కార‌ణం.. ఓ అగ్నిప‌ర్వ‌తం.

అవును, దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో భారీ అగ్నిపర్వతం బద్ధలై.. ఈ ప్రాంతం మొత్తం తీవ్ర కలకలం సృష్టించింది. టోంగా ద్వీప దేశానికి సమీపంలో వాల్క‌నో విస్ఫోటం వల్ల సునామీ కెరటాలు విరుచుకుపడ్డాయి. టోంగా రాజధాని నుకుఅలోఫా తీవ్రంగా దెబ్బతింది. ప్ర‌స్తుతం సాయం కోసం ఎదురుచూస్తోంది. కమ్యునికేషన్‌ సేవలు దెబ్బతినడంతో లేటెస్ట్ అప్‌డేట్స్ వెంట‌నే తెలీటం లేదు. 

‘హుంగా టోంగా హుంగా హా అపై’ అనే అగ్నిపర్వతం.. నుకుఅలోఫాకు 64 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో ఉంది. శనివారం సాయంత్రం అది పేలిపోయింది. ఆ విస్పోట‌నంతో బూడిద, నీటి ఆవిరి, వాయువులు.. పసిఫిక్ స‌ముద్ర జలాలను చీల్చుకుంటూ ఒక్కసారిగా పైకి ఎగిసినట్టు శాటిలైట్ ఫోటోస్‌తో గుర్తించారు. ఈ ఫోటో అదే....

విస్ఫోటం వల్ల వెలువడిన బూడిద.. ఆకాశంలో దాదాపు 20 కిలోమీటర్ల ఎత్తువరకూ ఆవరించింది. పేలుడు ధాటికి సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ద‌లైన శబ్దం.. 10వేల కిలోమీటర్ల దూరంలోని అలస్కా వరకూ వినిపించింది. ఇది 5.8 తీవ్రతతో కూడిన భూకంపంతో సమానమని అమెరికన్ సైంటిస్టులు తెలిపారు. 

టోంగాతో పాటు జపాన్‌, ఫిజీ, హవాయి, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, చిలీ, అలస్కా సహా అమెరికా పశ్చిమ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సునామీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జపాన్‌ పసిఫిక్‌ తీర ప్రాంతంలో స‌ముద్ర‌ కెర‌టాలు మీటర్‌ ఎత్తు ఎగిసిపడ్డాయి. ప్ర‌స్తుతం సునామీ ముప్పు కాస్త త‌గ్గిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. అయినా, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు.