కాంగ్రెస్‌లో చేరికపై క్లారిటీ ఇచ్చిన డీఎస్‌

 

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశం అయ్యారు.కొంతకాలంగా తెరాస పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలు వస్తున్నాయి.డీఎస్‌కు సన్నిహితుడు, ఎమ్మెల్సీ భూపతిరెడ్డితో పాటు డీఎస్‌ అనుచరులు పలువురు ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు.ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీతో డీఎస్‌ భేటీ అవ్వటంతో ఆయన రాహుల్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు అంతా భావించారు.కానీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన డీఎస్‌ తాను కాంగ్రెస్‌లో చేరినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు.తాను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవడానికి సమయం అడిగానని చెప్పారు. తనకు రాహుల్‌ సమయం ఇచ్చారని.. ఆయనని కలిశానని తెలిపారు. అయితే రాహుల్‌తో ఏం మాట్లాడానో మీతో చెప్పాల్సిన పనిలేదని ఆయన మీడియానుద్దేశించి అన్నారు. తాను చాలా మంది నేతలను గతంలో కలిశానని.. కలుస్తూనే ఉంటానని వెల్లడించారు.అయితే కాంగ్రెస్ లో చేరికపై మాత్రం ఇంకా స్ఫష్టత ఇవ్వలేదు.

మరోవైపు కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన తెరాస నాయకుడు టి.నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కాంగ్రెస్‌లో చేరారు.ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకొన్నారు. అనంతరం నర్సారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చేరడం తాము సొంత ఇంటికి వచ్చినట్లుందని అన్నారు. ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలన్నారు. తెరాసలో ఏ నాయకుడికి ఆత్మగౌరవం ముఖ్యమంత్రి ఇవ్వలేదని విమర్శించారు. తెరాస పాలనలో అన్నివర్గాలను మోసం చేశారని రాములునాయక్‌ ఆరోపించారు. ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తామని అన్నారు. రాష్ట్రం బందీయైన తెలంగాణగా మారిందని విమర్శించారు.రాములునాయక్‌ నారాయణ్‌ఖేడ్‌ నుంచి తెరాస టికెట్‌ను ఆశించారు. అది దక్కకపోవటంతో పార్టీపై అసంతృప్తి వ్యక్తంచేయగా ఆయన్ని తెరాస సస్పెండ్‌ చేసింది.దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు.