కాంగ్రెస్ లోకి డీఎస్ తో పాటు పలువురు సీనియర్లు.. నష్టమేనా?
posted on Oct 27, 2018 11:58AM

కేసీఆర్ మళ్ళీ అధికారం తమదే అనే నమ్మకంతో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. కానీ ఈ ముందస్తు ముహూర్తం ఏంటో అనూహ్యంగా కాంగ్రెస్ కి కలిసిసొస్తుంది. మొన్నటివరకు కాంగ్రెస్ తెలంగాణలో కూడా ఇప్పట్లో అధికారంలోకి రావడం కష్టమే అనుకున్నారు. కానీ మహాకూటమి ఏర్పాటుతో కాంగ్రెస్ బలం పెరిగింది. ఈసారి అధికారం తమదేనన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లో ఏర్పడింది. అంతేకాదు కాంగ్రెస్ లోకి వలసలు కూడా బాగా పెరిగాయి. గతంలో కాంగ్రెస్ ని వీడినవారు, కొత్తవారు ఇలా చాలామంది నేతలు కాంగ్రెస్ కి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా తెరాసలో టిక్కెట్ల విషయంలో అసంతృప్తిగా నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో మంచి పట్టున్న కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్.. నల్లగొండ జిల్లా దేవరొండకు చెందిన బాలూనాయక్ ఇలా పలువురు కాంగ్రెస్ గూటికి చేరారు.
అయితే ఇప్పుడు వీళ్ళ బాటలోనే మరికొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్ లోకి అడుగుపెడుతున్నారు. వారిలో ముఖ్యలు డి.శ్రీనివాస్. అయితే ఈయనది అందరిలా టిక్కెట్ విషయంలో అసంతృప్తి కాదు. ఈయన మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అంటూ నిజామాబాద్ తెరాస నేతలు కేసీఆర్ కి లేఖ రాసారు. అధిష్టానం కూడా డీఎస్ విషయంలో సానుకూలంగా స్పందించలేదు. తెరాస తనను పొమ్మనలేక పొగపెడుతుందని గ్రహించిన డీఎస్.. కాంగ్రెస్ గూటికి తిరిగి చేరడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన రాకను కాంగ్రెస్ లోని కొందరు నేతలు వ్యతిరేకించినా.. ఎట్టకేలకు చర్చలు ఫలించి రూట్ క్లియర్ అయింది. దీంతో డీఎస్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్దమయినట్టు తెలుస్తోంది. డీఎస్ తో పాటు తెరాస బహిష్కృత నేతలు ఎమ్మెల్సీ రాములు నాయక్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోబోతున్నట్టు సమాచారం. ఇలా నేతల వలసలతో కాంగ్రెస్ పార్టీ కళకళలాడుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి భవిష్యత్తులో లాభమా? నష్టమా?. గతంలో తెరాసలో నేతలు ఇలాగే చేరారు.. కానీ ఏమైంది?. టిక్కెట్ల కేటాయింపుతో అసంతృప్తి సెగ తగిలింది. ఇప్పుడు కాంగ్రెస్ లోకి కూడా భారీగా నేతలు క్యూ కడుతున్నారు. మహాకూటమిలోని మిగతా పార్టీలకు సీట్ల సర్దుబాటు చేయాలి.. అదే విధంగా పార్టీలో నేతలు సంతృప్తి చెందేలా టిక్కెట్లు కేటాయించాలి. లేదంటే తెరాస లాగా కాంగ్రెస్ కి కూడా ఇబ్బందులు తప్పవు. పార్టీలోని పాత నేతలు, కొత్త చేరికలు, కూటమిలోని పార్టీలు మధ్య కాంగ్రెస్ టిక్కెట్ల సవ్యంగా కేటాయించి.. అసంతృత్తి సెగ తగలకుండా ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడాలి.