తెరాస ఆఖరి అస్త్రం.. తెర పైకి సమైక్య వాదం!
posted on Dec 2, 2022 2:17PM
ఇటునుంచి కాకపోతే, అటునుంచి నరుక్కు రమ్మన్నారు, పెద్దలు. తెలంగాణ రాజకీయాల్లో చకచకా చోటు చేసుకుంటున్న మార్పులను గమనిస్తే, అధికార తెరాస నాయకత్వం, కమ్ముకోస్తున్న ‘కారు’ మబ్బుల్లోంచి బయట పడేందుకు, సమైక్య కుట్రల పేరున సెంటిమెంట్’ను శరణు వేడడం తప్ప మరో మార్గం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని,రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి ఇళ్లు వాకిళ్లపై ఐటీదాడులు,ఆ తర్వాత డైరెక్ట్ గా, ఢిల్లీ మద్యం కేసులో, తెరాస ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పేరు పైకి రావడంతో, తెరాస నాయకత్వానికి మరోమార్గం లేక సెంటిమెంట్ గుర్తుకొచ్చింది. నిజానికి, 2014లో అధికారంలోకి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస ఇకపై ఎంత మాత్రం ఉద్యమ పార్టీ కాదని తేల్చి చెప్పారు. అలాగే తెరాస ఇక పై ఫక్తు పదహారు అణాల రాజకీయ పార్టీగా రాజకీయాలే చేస్తుందనీ కుండ బద్దలు కొట్టారు. నిజానికి ప్రభుత్వంలో, తెలంగాణ రాజకీయాల్లో ఉద్యమ స్పూర్తి కాదు, కనీసం ఉద్యమ వాసనలు అయినా లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్న తమ కుటుంబ సభ్యులు మినహా మిగిలిన వారందరినీ సాగనంపారు. వైఎస్సార్, ‘చేవెళ్ళ చెల్లెమ్మ’ సబితా ఇంద్రా రెడ్డి సహా తెరాస ఉద్యమ నాయకత్వం ఉద్యమ ద్రోహులుగా ప్రకటించిన తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి వంటి వారందరికీ మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అదేమంటే, ఉద్యమంలో పాల్గొన్నవారికే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రాజ్యాంగంలో ఉందా అంటూ ప్రశ్నించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ సెంటిమెంట్ ను ఉద్దేశపూర్వకంగా పలుచన చేశారు.
అయితే ఇప్పుడు మారిన పరిస్థితులలో తెరాస నాయకత్వానికి సెంటిమెంటే శ్రీరామ రక్షగా కనిపిస్తోంది. అందుకే, అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అంటూ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను సొంత చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని తాజా పరిణామాలను రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా, ప్రాంతీయ వాదాన్ని, తెరపైకి తెచ్చే ప్రయత్నం మొదలైందని పరిశీలకులు అంటున్నారు. వైఎస్సార్ టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ వెనక ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే కుట్ర ఉందని అందుకే కేసీఆర్ కుమార్తె కవిత మొదలు తాజగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వరకు, అనేక మంది మంత్రులు, ఇతర నాయకులు, ఇప్పడు షర్మిల ప్రాంతీయ మూలాలను ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.
ఆమె పార్టీ పెట్టి పాదయాత్ర మొదలు పెట్టి సంవత్సరం పైగా అయిన తర్వాత ఇప్పడు షర్మిల ప్రాంతీయ మూలాలను ప్రశ్నించడం వెనక సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ షర్మిల మనసులో ఏముందో ఇందుకోసం ఆమె పుట్టింటిని వదిలి అత్తింటికి చేరారో ఏమో కానీ, ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేశారు. ఈ దశలో ఆమె యాత్ర మీద దాడి జరగటం, ఆపై నాటకీయ పరిణామలు నడుమ ఆమెను అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యయాయి.ఇక ఇదే సమయంలో గులాబీ నాయకులు వైఎస్ షర్మిలను ఆంధ్ర పేరుతో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిలకు పులివెందులలో ఓటు హక్కు ఉందని అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల పని చేసిందని సోదరుడు పదవి ఇవ్వకపోవడంతో, ఇప్పుడు తెలంగాణలో షర్మిల తాను తెలంగాణ కోడలినని కొత్త రాగం అందుకుందని టార్గెట్ చేస్తున్నారు.
అయితే ఇక్కడ తెరాస అసలు టార్గెట్ షర్మిల కాదని, ప్రధాన లక్ష్యం స్వీయ రక్షణ అయితే బీజేపీకి సమైక్య ముద్ర వేసే ప్రయత్నమే ప్రధానంగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ముఖ్యమంత్రి కేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టడానికి, ఆయన ప్రతిష్టను దెబ్బతీసి, తెరాసను, తెరాస నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలను అప్రతిష్టపాలు చేయడానికి సమైక్యవాదులు కుట్రలకు పాల్పడుతున్నారని, సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని జరుగుతున్న దాడులు గత కొద్ది రోజులుగా టిఆర్ఎస్ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు కెసిఆర్ కుటుంబం పై జరుగుతున్న కుట్రలు, తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తీరు, వైయస్ షర్మిల పాదయాత్ర, బండి సంజయ్ పాదయాత్ర తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్ష వంటి అంశాలను ప్రస్తావించిన ఆయన ఈ పరిణామాలన్నింటినీ చూస్తే కెసిఆర్ ను దెబ్బ తీయడం కోసం జరుగుతున్న కుట్రగా కనిపిస్తోందన్నారు. ఏపీలో చేతకాక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
నిజానికి, ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్’ ఆశించిన విధంగా రక్తి కట్టక పోవడం, అదే సమయంలో సర్దుకుందనుకున్న ఢిల్లీ మద్యం స్కాం లో లో కవిత రోల్ ఒక్కసారిగా దూసుకు రావడం, ఈ అన్నిటినీ మించి కేంద్రం కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, సామంతులు, ఎంతమంది ఎంతగా గగ్గోలు పెట్టినా సామాన్య తెలంగాణ ప్రజలు స్పందించక పోవడంతో తెరాస నాయకత్వం సెంటిమెంట్ అస్త్రాన్ని మరోమారు తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అయితే, సమైక్యవాదం మాటున తెలంగాణ సెంటిమెంట్ ను మళ్ళీ తెరమీదకు తేవడం అయ్యేపని కాదని పరిశీలకులు అంటున్నారు.నిజానికి, సమైక్యవాదానికి బట్టలు తొడిగితే ఎలా ఉంటుందో, అలా ఉండే ఉండవల్లి అరుణ కుమార్ కు పూర్ణ కుంభంతో ప్రగతి భవన్ లోకి స్వాగతం పలికిన తెలంగాణ నాయకత్వం, ఇప్పడు సమైక్య వాదం, సమైక్య వాదుల కుట్రల గురించి మాట్లాడితే ప్రజలు నమ్మరని, నవ్వుతారని పరిశీలకులు అంటున్నారు.