టీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి? పుంజుకుంటున్న కాంగ్రెస్!
posted on May 8, 2017 12:41PM
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీస్తోందా? ప్రజల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌కి మెల్లమెల్లగా ఆదరణ పెరుగుతోందా? తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం కాంగ్రెస్‌దేనా? అవునంటోంది ఓ వాట్సప్ సర్వే. నమ్మడానికి కొంత సందేహం కలిగినా.... ఓ నియోజకవర్గంలో నిర్వహించిన వాట్సప్ సర్వేలో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. లేటెస్ట్ టెక్నాలజీని, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ జరిపిన ఈ వాట్సప్ సర్వేలో ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంటే... కాంగ్రెస్ లీడర్‌కే ఎక్కువ ఓట్లు రావడం సంచలనంగా మారింది.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ నేతలు చేస్తోన్న పోరాటం సత్ఫలితాలను ఇస్తున్నట్లే కనిపిస్తోంది. తాజాగా కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వాట్సప్ పోల్ నిర్వహించింది. టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రస్తుత ఎమ్మెల్యే పుట్టా మధు, కాంగ్రెస్ తరపున దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుతో పాటు మరో ఇద్దరు బరిలో నిలిచారు. ఈ పోల్‌లో టీఆర్ఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా ఓట్లు వేశారు. మొత్తం 611 ఓట్లు నమోదు కాగా.... 345 శ్రీధర్ బాబుకు.... పుట్టా మధుకు 258 ఓట్లు వచ్చాయి. తొలుత పుట్టా మధు ఆధిక్యం కనబరచినా... చివరికి ఓటింగ్ శ్రీధర్ బాబు కు అనుకూలంగా మారింది. ఇదే ఇప్పుడు టీకాంగ్రెస్ నేతల్లో జోష్ పెంచుతోంది.
టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, కేసీఆర్ కుటుంబంపైనా తెలంగాణ ప్రజల్లో మెల్లగా వ్యతిరేకత పెరుగుతోందని... 2019 నాటికి అది మరింత ఎక్కువవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ వైఫల్యాలను, కేసీఆర్ మాయ మాటలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. అందుకోసం సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించుకోవాలని డిసైడ్ అయ్యింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రతి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించి... పార్టీ పరిస్థితిపైనా, అభ్యర్ధిపైనా ఓ అంచనాకి రానుంది. అందులో భాగంగానే మంథనిలో వాట్సప్ గ్రూపుల్లో శాంపిల్ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే శాంపిల్ సర్వేలో పాజిటివ్ రిజల్ట్ రావడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో 2019 విజయంపై నమ్మకం పెరిగింది. ఒక్క మంథనిలోనే కాదు... రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు.