వృక్షో రక్షతి..
posted on Jun 27, 2019 12:11PM
ఇది ఓ మనిషి కథ! అతను చాలా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తన ఇంటికి దగ్గరలోనే ఉన్నా ఓ జామచెట్టు దగ్గరకి వెళ్లి ఆడుకునేవాడు. దాని కొమ్మలను ఎక్కి తెగ ఊగేవాడు. దానితో ఆటలాడీ ఆడీ అలసిపోయి.. ఆ చెట్టు నీడనే మధ్యాహ్నం వేళ నిద్రపోయేవాడు. ఓ మాటలో చెప్పాలంటే ఆ జామచెట్టు అతని నేస్తం. జామచెట్టుకి కూడా అతనంటే భలే ముచ్చటగా ఉండేది. తన ప్రాంగణంలో ఆడుకునే అతన్ని చూస్తే సంతోషం కలిగేది. అలాంటిది ఆ పిల్లవాడు కొన్నాళ్లపాటు జామచెట్టుకి కనిపించకుండా పోయాడు.
ఓ రోజు పిల్లవాడు తన పక్క నుంచీ వెళ్లడాన్ని జామచెట్టు గమనించింది. ‘మిత్రమా! ఎన్నాళ్లయ్యింది నిన్ను చూసి. రా కాసేపు నాతో ఆడుకో! నేను ఇచ్చే జామపళ్లు తిను!’ అని అడిగింది.
‘పళ్లా పాడా! పైగా ఆడుకోవడం కూడానా! నేను అంత చిన్నపిల్లవాడినేం కాదు. ఇప్పుడు సంపాదించే వయసు వచ్చేసింది’ అన్నాడు. అతను ఇప్పుడు పిల్లవాడు కాదు యువకుడు.
‘ఓస్ అంతేకదా! నా జామపళ్లన్నీ కోసుకుని వెళ్లి అమ్ముకో. నీకు బోలెడు డబ్బులు వచ్చేంతగా కాస్తాను,’ అన్నది జామచెట్టు.
జామచెట్టు ఉపాయం వినగానే యువకుడికి తెగ సంతోషం కలిగింది. క్షణం ఆలస్యం చేయకుండా జామకాయలన్నీ తెగ తెంపుకుని సంతకు బయల్దేరాడు. ఇలా కొన్నాళ్లు సాగిన తరువాత మళ్లీ అకస్మాత్తుగా పిల్లవాడు కనిపించకుండా పోయాడు.
జామచెట్టుకి మళ్లీ పిల్లవాడి మీద బెంగపట్టుకుంది. అతను ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అని ఎదురుచూడసాగింది. అనుకోకుండా ఓ రోజు మళ్లీ ఆ యువకుడా అటువైపుగా వస్తూ కనిపించాడు. ‘మిత్రమా! ఎన్నాళ్లయ్యింది నిన్ను చూసి. రా! వచ్చి నా జామ పళ్లు కోసుకువెళ్లి అమ్ముకో!’ అని అడిగింది.
‘పళ్లా పాడా! పైగా అమ్ముకోవడం కూడానా! నేను అంత పేదవాడినేం కాదు. చాలా వ్యాపారాలు చేస్తున్నాను. సొంత ఇల్లు కట్టుకునే ఆలోచనలో ఉన్నాను’ అన్నాడు. అతను ఇప్పుడు కేవలం యువకుడు కాదు... గృహస్థు.
‘ఓస్ అంతేకదా! నా కొమ్మలన్నీ విరుచుకుని వెళ్లు. నీకు తోచిన రీతిలో ఇల్లు కట్టుకో,’ అన్నది జామచెట్టు.
జామచెట్టు మాటలు విన్న గృహస్థు ప్రాణం లేచి వచ్చింది. రోజైనా గడవకుండా గొడ్డలిని తీసుకువచ్చి జామచెట్టు కొమ్మలన్నీ కొట్టివేసి పట్టుకుపోయాడు. ఇది జరిగిన మర్నాటి నుంచి గృహస్థు కనిపించకుండా పోయాడు.
జామచెట్టు ఎప్పటిలాగే పిల్లవాడి కోసం తపించిపోయింది. వేయి కళ్లతో అతను కనిపించకుండా పోతాడా అని పగలూరాత్రీ ఎదురుచూసింది. ఆ రోజు రానే వచ్చింది. గృహస్థు, జామచెట్టు పక్కనుంచీ వెళ్తూ కనిపించాడు. ‘మిత్రమా! ఎన్నేళ్లయ్యిందో నువ్వు కనిపించి. రా! వచ్చి కట్టెలు కొట్టుకుని వెళ్లు. దేనికన్నా ఉపయోగపడతాయేమో!’ అని ప్రాథేయపడింది.
‘నేనేమన్నా కట్టెలు కొట్టుకునేవాడిలా కనిపిస్తున్నానా! నేనిప్పుడు పెద్ద వ్యాపారస్తుడిని. త్వరలోనే విదేశాలకు వెళ్లి నా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నాను,’ అని చిరాకుపడ్డాడు గృహస్థు... కాదు కాదు వ్యాపారస్తుడు.
‘ఓస్ అంతేకదా! నా వేళ్లు తప్ప మిగతా భాగాన్నంతా తొలిస్తే నీకు కావల్సినంత విశాలమైన కలప దొరుకుతుంది. దాంతో పడవను చేసుకుని వ్యాపారం చేసుకో!’ అన్నది చెట్టు.చెట్టు చెప్పిన మాట బాగానే అనిపించింది వ్యాపారస్తునికి. వెంటనే పనివాళ్లను వెంటపెట్టుకుని వచ్చాడు. జామచెట్టుని నిర్దాక్షిణ్యంగా నరకడం మొదలుపెట్టాడు. దాని వేళ్లు తప్ప మిగతా భాగాన్నంతా బండ్లకి ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి అతను కనిపించడం మానేశాడు.
జామచెట్టు మాత్రం మొండి వేళ్లతో, వ్యాపారస్తుని తిరిగిచూడానే మొండి ఆశతో కాలం గడుపుతూ ఉంది. కొన్నాళ్లకి ఆ వ్యాపారస్తుడే చెట్టు వైపు రావడం కనిపించింది. ‘రా మిత్రమా రా! ఎన్నాళ్లయ్యిందో నిన్ను చూసి. కానీ ఇప్పుడు నీ ఆకలి తీర్చడానికి పళ్లు లేవు. అవసరాలు తీర్చడానికి కట్టెలు లేవు. కాస్త సేద తీర్చడానికి నీడ కూడా లేదు. క్షమించు’ అంది జామచెట్టు దీనంగా.
జామచెట్టు మాటలు విన్న వ్యాపారస్తునికి దుఃఖం ఆగలేదు... ‘జామపళ్లు తినే శక్తి నాకిప్పుడు మిగల్లేదు. నేను కష్టపడి నిర్మించుకున్న వ్యాపారం కొడుకులు చూసుకుంటున్నారు. నేను కట్టుకున్న ఇంటిని కోడళ్లు చూసుకుంటున్నారు. నన్ను మాత్రం ఎవరూ చూసుకోవడం లేదు. చిన్నప్పటి నుంచి నువ్వే నాకు తోడుగా ఉన్నావు, అందుకని ఇప్పుడు నీ తోడు కోసమే ఇక్కడికి వచ్చాను,’ అంటూ మొండి చెట్టు దగ్గర కూలబడిపోయాడు.
వ్యాపారికి ఆ విచక్షణ మొదట్లోనే ఉండి ఉంటే... జామచెట్టు పచ్చగా ఉండేది. వ్యాపారి జీవితమూ అత్యాశకి దూరంగా తృప్తిగా సాగేది.
(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)
- నిర్జర