సమయస్ఫూర్తి
posted on Oct 17, 2020 9:30AM
ఇది అనగా అనగానాటి మాట. అప్పట్లో ఓ మారుమూల గ్రామంలో... పార్వతమ్మ అనే ముసలమ్మ ఉండేది. ఆమెకి పాపం రానురానూ కళ్లు మసకబారిపోయాయి. ఓ రోజు తన గ్రామంలోకి ఒక వైద్యుడు వచ్చాడనీ, ఆయన హస్తవాసి చాలా మంచిదనీ పార్వతమ్మ విన్నది. ఆ వైద్యుడి వల్ల తన కళ్లు బాగుపడి తిరిగి ఈ అందమైన లోకాన్ని చూసే భాగ్యం కలిగితే బాగుండు అనుకుంది. అనుకున్నదే తడువుగా, తన పక్కింటి కుర్రవాడిని బతిమాలుకుని, అతని చేయిపట్టుకుని ఆ వైద్యుని వద్దకు చేరుకుంది.
‘బాబూ నాకు నా ఇంటినీ, ఆ ఇంటి చుట్టూ ఉండే తోటనీ, ఆ తోటలో పూలనీ, వాటిపై వాలే సీతాకోకచిలుకల్నీ... తిరిగి ఈ కళ్లతో చూడాలని ఆశ. అందుకోసం నా దగ్గర దాచుకున్న డబ్బంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలాగైనా నా చూపును తిరిగి రప్పించు,’ అని బతిమాలింది.
వైద్యుడు నిజంగా మంచి హస్తవాసి కలిగినవాడే. కానీ దాచుకున్న డబ్బునంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని పార్వతమ్మ అనేసరికి అతనిలో అత్యాశ మొదలైంది. ‘సరే మామ్మగారూ! నేను చేయగలిగినదంతా చేస్తాను. కాకపోతే అందుకోసం ఖరీదైన మందుల్ని వాడాల్సి ఉంటుంది. మీకు కనుక తిరిగి చూపు వస్తే నాకు పదివేల వరహాలు ఇవ్వాలి మరి,’ అన్నాడు వైద్యుడు.
పదివేల వరహాలంటే మాటలా! ముసలమ్మ తన జీవితాంతం కడుపుకాల్చుకుని కూడపెట్టుకున్నదంతా కలిపితే అంత అవుతుంది. అయినా ముసలమ్మ తన చూపు కోసం అంత డబ్బునీ ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ వైద్యుని అత్యాశని గమనించి ముందుజాగ్రత్తగా ఒక షరతుని విధించింది. `నువ్వు ఇవ్వమన్న డబ్బుని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నా చూపు తిరిగి బాగుపడితేనే సుమా!’ అంది పార్వతమ్మ. దానికి వైద్యుడు సరేనన్నాడు.
ఆనాటి నుంచీ ప్రతిరోజూ ఉదయాన్నే వైద్యుడు ఠంచనుగా పార్వతమ్మ ఇంటికి చేరుకునేవాడు. తాను తయారుచేసిన, లేపనాలనీ, లేహ్యాలనీ, భస్మాలనీ ఆమెకు అందిచేవాడు. అయితే వైద్యుడికి ఆశ ఎక్కువ కదా! ముసలమ్మ ఇంటికి వచ్చినప్పుడల్లా, ఆ ఇంట్లో ఉండే ఇత్తడీ, రాగి సామాన్లని చూసి అతనికి ఆశ పుట్టేది.
‘ఈ ముసలమ్మకి ఎలాగూ కనిపించదు! వీటిలో కొన్నింటిని తీసుకుంటే ఏం పోయింది. ఒకవేళ ఆవిడకి చూపు రాకపోతే, ఇన్నాళ్లూ నేను చేసిన వైద్యానికి ఖర్చులుగా అన్నా ఇవి ఉపయోగపడతాయి’ అన్న ఆలోచన అతనిలో మొదలైంది. ‘ఒకవేళ ఆవిడకి చూపు తిరిగి వచ్చినా ఎప్పుడో ఇంటి మారుమూల ఉంచుకున్న వస్తువుల ఏం గుర్తుంటాయి’ అనుకున్నాడు. దురాశ మొదలైందే తడువు, పార్వతమ్మ వైద్యం కోసం వచ్చే ప్రతిసారీ.... అందుబాటులో ఉన్న చిన్నాచితకా సామానుని తన సంచీలో కుక్కుకుని బయల్దేరేవాడు.
పార్వతమ్మ నమ్మకం చేతనో, లేకి నిజంగానే వైద్యుని హస్తవాసి ఫలించడం చేతనో.... ఆరు మాసాలు తిరిగేసరికల్లా ఆమెకు స్పష్టంగా చూపు తిరిగి వచ్చేసింది. కానీ పార్వతమ్మ సామన్యురాలా! తన ఇంట్లో చాలా వస్తువులు మాయమవ్వడం ఆమె గ్రహించింది.
పార్వతమ్మకు చూపురాగానే, చేసుకున్న ఒప్పందం ప్రకారం... తనకి ఇవ్వవలసి పదివేల వరహాలను ఇవ్వమని వైద్యుడు అడిగాడు. దానికి పార్మతమ్మ ససేమీరా అంది. విషయం గ్రామాధికారి వరకూ చేరింది.
``ఏవమ్మా! పెద్దదానివై ఉండీ ఇలా మాట తప్పడం నీకు గౌరవమేనా. చూపు తిరిగి వస్తే పదివేల వరహాలు చెల్లిస్తాన్న షరతుకి ఒప్పుకున్నావా లేదా?’’ అని నిలదీశాడు గ్రామాధికారి.
``ఆ షరతుకి నేను లోబడి ఉన్న మాట నిజమేనయ్యా! కానీ ఈయన వైద్యంలో ఏదో లోపం జరిగింది. లేకపోతే, ఆయన మా ఇంటికి రాక ముందు ఉండాల్సిన సామానులన్నీ, ఇప్పుడు నాకు కనిపించకుండా పోవడమేంటి? అందుకనే ఆ మొత్తాన్నీ నేను చెల్లించలేదు’’ అని బదులిచ్చింది పార్వతమ్మ.
పార్వతమ్మ మాటలకు గతుక్కుమన్నాడు వైద్యుడు. అక్కడికి చేరుకున్నవారందరికీ కూడా పార్వతమ్మ మాటల్లోని ఆంతర్యం బోధపడి, ముసిముసినవ్వులు నవ్వుకుంటూ ఎవరి ఇళ్లకు వారు బయల్దేరారు.
చేసిన దొంగతనం అలా బయటపడిపోవడంతో, గ్రామాధికారి దగ్గర చీవాట్లు తిని, ఇక నుంచి బుద్ధిగా మసులుకుంటానని మాట ఇచ్చి, వడివడిగా తన ఇంటికి వెళ్లిపోయాడు వైద్యుడు.
అలా ముసలామె, వైద్యుడి అత్యాశని తీర్చేందుకు పదివేల వరహాల రుసుముని తప్పించుకోవడమే కాదు. అతని దొంగబుద్ధి గురించి గ్రామం మొత్తానికీ తెలియచేసినట్లయింది. దాంతో పాటుగా తన అందమైన తోటని తిరిగి చూడాలన్న కోరికా నెరవేరింది.
(ఏసోప్ కథల ఆధారంగా)
-నిర్జర