టాప్ న్యూస్ @ 1PM

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్థంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను గుర్తు చేసుకున్నారు. బాలు లేరన్న విషయాన్ని నమ్మాలనిపించడం లేదని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘మైమరపింపచేసే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. అందుకే ఆయన శివైక్యం చెంది ఏడాది అయ్యిందంటే నమ్మాలని అనిపించడంలేదు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ప్రథమ వర్ధంతి సందర్భముగా ఆ గాన గంధర్వుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు
-----
ఏపీలో వైద్య విధాన పరిషత్, విద్యా వ్యవస్థలు పూర్తిగా నాశనమవుతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ఎయిడెడ్ విద్యా సంస్థల రద్దుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50 శాతం నిధులు ఆగిపోతాయని చెప్పారు. ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని చెప్పిన 12 కాలేజీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ 12 కాలేజీల లెక్చరర్లకు రఘురామకృష్ణరాజుకు ఇచ్చినట్టు కౌన్సిలింగ్ ఇవ్వడం దారుణమని అన్నారు.
-----
అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను జియో సంస్థ సబ్ డొమైన్ లో విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సేవాభావంతోనే జియో సంస్థ ఈ సేవలను అందించడానికి ముందుకొచ్చిందని.. జియో క్లౌడ్ ద్వారా గంటన్నర వ్యవధిలోనే 2.39 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పించామని చెప్పారు.ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు.
-----
కర్నూలు జిల్లా లద్దగిరిలో కేంద్ర మాజీమంత్రి, టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తి హల్‌చల్ చేశాడు. సూర్యప్రకాశ్ రెడ్డిని చంపేస్తానంటూ గట్టిగా అరిచాడు. ఈ ఘటనపై సూర్యప్రకాశ్ రెడ్డి వెంటనే  పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు లద్దగిరిలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వ్యక్తిని గుర్తించిన పోలీసులు.. కేకలు వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
-----
కృష్ణాజిల్లా పెడనలో జనసేన నాయకుడి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త యడ్లపల్లి రామ్ సుధీర్ కారును దుండగులు ధ్వంసం చేశారు. పెడన రైల్వే గేట్ సమీపంలోని హైఫై హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పెడన పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఉన్న హోటల్‌లో రాత్రి రామ్ సుధీర్ బస చేశారు. అయితే బయట నిలిపి ఉంచిన కారు అద్దాలను రాళ్లతో పగలకొట్టారు ఆగంతకులు. 
-----
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ఆరా తీశారు. ఇన్‌చార్జి సెక్రటరీ బోసురాజుతో మాణిక్కం ఠాగూర్ సమాచారం తెప్పించుకున్నారు. శనివారం గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ తీరును సమావేశంలో నిలదీసేందుకు జగ్గారెడ్డి రెడీ అయ్యారు.
-------
ముఖ్యమంత్రి కేసీఆర్‌, కౌశిక్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు. ‘‘తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదు కేసీఆర్’’ అని వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉన్న వారికి దళిత బందు ఇవ్వరా అని  ప్రశ్నించారు. ఏం పదవి ఏం హోదా ఉందని కౌశిక్ రెడ్డి తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన రాజీనామా వల్లే కౌశిక్ రెడ్డికి ప్రగతి భవన్‌లో ఎంట్రీ దొరికిందన్నారు. పదవి కూడా రాబోతుందని... ఈ విషయం ప్రజలకు తెలుసని ఈటెల అన్నారు
-------
టీఆర్ఎస్ సీనియర్ నేత, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు మళ్లీ అదృశ్యమయ్యారు. గత రెండు రోజుల నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఎవరికీ అందుబాటులో లేరు. కుటుంబ సభ్యులకు ఆయన ఎక్కడున్నారన్న వివరాలు చెప్పలేదు. ఆయన వినియోగించే వ్యక్తిగత వాహనాలను సైతం ఇంటిదగ్గరే వదిలిపెట్టారు. గతంలోనూ ఆయన ఇలాగే కనిపించకుండా పోతే పోలీసులే ఆయనను ఆంధ్రప్రదేశ్‌లో పట్టుకుని ఇక్కడికి తీసుకువచ్చారు.
----
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల విలువ గత ఏడాదితో పోలిస్తే స్వలంగా పెరిగింది. మోదీ తాజా డిక్లరేషన్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.22 లక్షలు పెరిగింది. గత ఏడాది ఆయన ఆస్తుల విలువ రూ.2.85 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది రూ.3.07 కోట్లకు పెరిగింది. ప్రధాని వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ఉంచారు.
--------
రాజస్థాన్ లోని జైపూర్ లో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు చనిపోయారు. అందులో ఐదుగురు విద్యార్థులు కాగా.. ఒకరు కారు డ్రైవర్. మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. జైపూర్– ఢిల్లీ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించింది.
----