టీడీపీతో జనసేన పొత్తు ఖాయమేనా? పరిషత్ ఎన్నికలతో క్లారిటీ వచ్చినట్టేనా? 

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలో టీడీపీతో కలిసి పోటీ చేశాయి. 2019 ఎన్నికల్లో మాత్రం మూడు పార్టీలు విడివిడిగానే బరిలో నిలిచాయి. ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన మధ్య సయోధ్య కుదిరింది. అయితే బీజేపీతో పొత్తు విషయంలో జనసేన హ్యాపీగా లేదనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. బీజేపీతో కటీఫ్ చెప్పడానికి జనసేనాని సిద్ధమవుతున్నారనే చర్చ కూడా ఉంది. తాజాగా అందుకు బలాన్నిచ్చేలా రాజకీయ సమీకరణలు ఏపీలో జరుగుతున్నాయి. బీజేపీతో కటీఫ్ చెప్పి టీడీపీతో కలిసి పనిచేసేందుకు పవన్ కల్యాణ్ పార్టీ పావులు కదుపుతున్నట్లు స్పష్టమైంది.  

ఏపీలో జరిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన మధ్య స్థానికంగా పొత్తులు కుదిరాయి. గోదావరి జిల్లాలో ఇవి మంచి ఫలితాలనే ఇచ్చాయి. ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో ఇది మరింత బలపడింది. రెండు పార్టీలు కలిసి పలు మండలాల్లో అధికార పార్టీకి షాకిచ్చాయి. గుంటూరు జిల్లా ప‌రిధిలోని మంగ‌ళ‌గిరి నియోజ‌కవ‌ర్గంలోని దుగ్గిరాల మండ‌లంలో అధికార వైసీపీకి టీడీపీ చుక్క‌లు చూపిస్తుండ‌గా.. తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని క‌డియం మండలంలో ఏకంగా ఎంపీపీ ప‌ద‌వినే కైవ‌సం చేసుకుంది. ఇక్క‌డ కేవలం నాలుగు స్థానాల‌ను ద‌క్కించుకున్న టీడీపీకి.. 8 స్థానాలు గెలుచుకున్న జ‌న‌సేన మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో పాటుగా ఎంపీపీ ప‌ద‌విని టీడీపీకి క‌ట్ట‌బెట్టింది జనసేన.  

క‌డియం మండ‌లంలో మొత్తం 22 ఎంపీటీసీ స్థానాలున్నాయి. నామినేష‌న్ల స‌మ‌యంలోనే వైసీపీ, జ‌న‌సేన ఒక్కో స్థానాన్ని ఏక‌గ్రీవంగా ద‌క్కించుకున్నాయి. మిగిలిన 20 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా.. వైసీపీ, జ‌న‌సేన 8 స్థానాల చొప్పున గెలుచుకోగా.. టీడీపీకి 4 స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. ఈ క్రమంలో ఎంపీపీ స్థానం వైసీపీకి ద‌క్కకుండా టీడీపీ, జ‌న‌సేన‌లు ఎన్నిక‌ల‌కు ముందు నుంచే వ్యూహాత్మ‌కంగా క‌లిసి సాగాయి. జ‌న‌సేన బ‌రిలో నిలిచిన స్థానాల్లో టీడీపీ మ‌ద్ద‌తు ప‌లికితే.. టీడీపీ బ‌రిలో నిలిచిన చోట జ‌న‌సేన మ‌ద్ద‌తు ప‌లికింది. రెండు పార్టీలు క‌లిసి వైసీపీకి చుక్క‌లు చూపాయి. అయితే ఎంపీపీ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు వైసీపీ ర‌చించిన వ్యూహాన్ని జ‌న‌సేన తిప్పికొట్టింది. తాను టీడీపీతోనే సాగుతాన‌ని తేల్చి చెప్పింది. క‌డియం జ‌డ్పీటీసీని తాను గెలిచేలా సాయం చేసిన టీడీపీకే క‌డియం ఎంపీపీని ఇచ్చేస్తున్న‌ట్లుగా జ‌న‌సేన సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 

జ‌న‌సేన ప్ర‌స్తుతం బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా సాగుతున్నా తిరుప‌తి పార్ల‌మెంటుకు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల నాటి నుంచి ఇరు పార్టీల మ‌ధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఏపీపై కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదనే అభిప్రాయంతో ఉన్నారు పవన్ కల్యాణ్. ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చడంపై గుర్రుగా ఉన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇరు పార్టీల మధ్య మరింత గ్యాప్ పెచ్చింది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తానని ప్రకటించారు పవన్ కల్యాణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేయడమంటే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే. ఈ లెక్కన బీజేపీతో తెగతెంపులకు పవర్ స్టార్ దాదాపుగా సిద్దమైపోయారని చెబుతున్నారు. అందులో భాగంగానే పరిషత్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకు సాగారన అంటున్నారు. 

జ‌న‌సేనాని ప్రస్తుతానికి బ‌య‌ట‌కు చెప్ప‌కున్నా.. 2014 సార్వత్రిక ఎన్నిక‌ల మాదిరిగా.. 2024లోనూ టీడీపీతోనే జ‌ట్టు క‌ట్ట‌డం ఖాయ‌మ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు నిద‌ర్శ‌నంగానే జ‌న‌సేన‌కు బ‌ల‌మున్న చోట‌ల్లా బీజేపీతో కాకుండా టీడీపీతోపొత్తు పెట్టుకునే ఆ పార్టీ ముందుకు సాగుతోంది. కడియంలో టీడీపీ కంటే త‌న బలం రెట్టింపుగా ఉన్నా కూడా టీడీపీకే ఎంపీపీ పీఠాన్ని వ‌దిలేసిన వైనం కూడా టీడీపీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య బ‌లం మ‌రింత‌గా బ‌లోపేతాన్ని సూచిస్తున్న‌దేన‌ని చెప్పాలి. టీడీపీ వెంట జ‌న‌సేన సాగితే.. 2024లో వైసీపీకి చుక్కలు ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లోనూ సాగుతోంది.