మళ్లీ మిస్సైన పుట్టమధు? కుటుంబ సభ్యుల్లో కలవరం..

గతంలో వారం రోజుల పాటు మిస్సైన టీఆర్ఎస్ సీనియర్ నేత, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు మళ్లీ అదృశ్యమయ్యారు. గత రెండు రోజుల నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఎవరికీ అందుబాటులో లేరు. కుటుంబ సభ్యులకు ఆయన ఎక్కడున్నారన్న వివరాలు చెప్పలేదు. ఆయన వినియోగించే వ్యక్తిగత వాహనాలను సైతం ఇంటిదగ్గరే వదిలిపెట్టారు. గతంలోనూ ఆయన ఇలాగే కనిపించకుండా పోతే పోలీసులే ఆయనను ఆంధ్రప్రదేశ్‌లో పట్టుకుని ఇక్కడికి తీసుకువచ్చారు. తాజాగా మరోసారి ఆయన కనిపించకుండా పోయారు.

తెలంగాణలో  పెను సంచలనం స్పష్టించిన పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు విషయంలో పుట్ట మధును పోలీసు ఉన్నతాధికారులు విచారించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సన్నిహితుడైన పుట్ట మధు ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన రోజే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో పుట్ట మధు అదృశ్యం అప్పట్లో రాజకీయ రచ్చగా కూడా మారింది.  ఆయన వారం రోజుల పాటు కనిపించకుండా పోయారు. చివరికి పోలీసులు అతడిని ఆంధ్రప్రదేశ్ లో ట్రేస్ చేసి తీసుకుచ్చారు. తర్వాత పోలీసుల విచారణకు హాజరయ్యారు పుట్ట మధు. 

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వేల కోట్ల రూపాయలను అక్రమంగా అర్జించారని, అక్రమాస్తులు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని బయట్టబయలు చేయడానికి న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, ఆయన సతీమణి నాగమణి ప్రయత్నాలు చేశారు. హైకోర్టులోనూ పిటిషన్ వేసి వాదనలు వినిపించారు. కానీ  వీరిని పట్టపగలే నడిరోడ్డుపై హతమార్చారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి పుట్ట మధు అనే ఆరోపణలున్నాయి. వీటిని ఆయన ఖండించారు. న్యాయవాద దంపతుల హత్య కేసులో ఇప్పటికీ పుట్ట మధు నిందితుడిగా ఉన్నారు. ఈ హత్యపై స్పందించిన హైకోర్టు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేసింది.