పరారీలో మాజీ మంత్రి జోగి రమేష్!

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, పెడన మాజీ ఎమ్మెల్యే  జోగి రమేష్ పరారీలో ఉన్నారా? అంటే పోలీసులు ఔననే అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి ఇంటిపై దాడి యత్నం కేసులో కీలక పాత్రధారి, సూత్రధారి అయిన జోగి రమేష్ అరెస్టు భయంతో పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన జోగి రమేష్ ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ సోమవారం (జులై 8)న విచారణకు రానున్నది. అయితే చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడికి యత్నించిన ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టుకు రంగం సిద్ధం చేశారన్న సమాచారంతో జోగి రమేష్ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.  

జోగి రమేష్ అరెస్టు విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీలు సహా పక్కా ఆధారాలను సేకరించిన పోలీసులు జోగి రమేష్ అరెస్టుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే  జోగి రమేష్ అజ్ణాతంలోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.