అయిదు పదుల ఆనందం కోసం

జీవితం జాంగ్రీ ఏమి కాదు, ఎప్పుడూ జ్యుసీ గా ఉండటానికి. యూత్ గా ఉన్నపుడు తరువాత బాగా సంపాదిస్తున్నపుడు ఉన్నట్టు వయసు పెరిగిపోయాక ఉండలేరు. కారణాలు బోలెడు ఉండచ్చు ఆ కారణాలు అన్ని కూడా జీవితాన్ని అయిదు పదుల తరువాత కాస్త భయంలోకి నెడుతున్న పరిస్థితులు ప్రస్తుత కాలంలో కోకొల్లలుగా చూస్తున్నాం. అయితే అయిదు పదుల తరువాత, వృద్ధాప్యం జతకట్టాక జీవితం ఆనందంగా ఉండాలంటే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యాన్ని కూడా ఆనందమానందమాయే అనుకుంటూ గడిపేయచ్చు. 

చాలామంది ఉద్యోగాల కోసం దూరప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే సొంత ఊరిలో ఉన్న భూములు, ఇల్లు లాంటివి కొన్ని అవసరాల దృష్ట్యా లేక అక్కడెందుకు అనే కారణాలతో అమ్మేస్తుంటారు. ఆ పనిని అసలు చేయకండి. విశ్రాంత జీవితం సొంత ఊర్లో స్వేచ్ఛగా, గౌరవంగా  ఉండేలా చేస్తుంది. 

ఇన్సూరెన్స్ లు డిపాజిట్ లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇలాంటివన్నీ పిల్లల పేరుతో వేయచ్చు కానీ మొత్తం కాదు సుమా!! ప్రేమను డబ్బు ద్వారా ఇలాంటి డిపాజిట్ ల ద్వారా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకంటూ కాసింత ఆర్థిక భరోసా కల్పించుకోవాలి మీరే

ఆధారపడటం చాలా పెద్ద తప్పు. పిల్లలు ఉద్దరిస్తారు అనే ఆశ అసలు పెట్టుకోకండి. కాలం ఎలాగైతే వేగంగా గడిచిపోతున్నట్టు అనిపిస్తోందో, మనుషులు కూడా అలాగే వేగంగా మారిపోతూ ఉంటారు. కాబట్టి డిపెండింగ్ ఈజ్ ఏ బిగ్ మిస్టేక్.

మానసిక విషయాల్లో వెన్నుదన్నుగా నిలబడి, జీవితంలో మంచి సలహాలు ఇస్తూ వస్తున్న వారిని చిన్న చిన్న గొడవలు కారణంగా వధులుకోకండి. చుట్టాలు, పిల్లలు కూడా చూపించలేని ఆప్యాయత నిజమైన స్నేహితుల దగ్గర మాత్రమే దొరుకుతుంది.

కంపెర్ చేసుకోవడం చాలా పెద్ద మూర్ఖత్వపు చర్య. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు చేస్తున్న పనులు బాగున్నాయి, వాళ్ళలా మేము లేము. లాంటి విషయాలను మొదట దరిదాపులకు కూడా రానివ్వకూడదు. ఫలితంగా నా జీవితం బాగుంది అనే తృప్తి సొంతమవుతుంది.  

జెనెరషన్స్ మారే కొద్దీ జీవితాల్లో మార్పులు సహజం. ఒకప్పటిలా ఇప్పటి తరం లేదు, ఇప్పటిలా రేపటి తరం ఉండదు. దీన్ని ఒప్పుకోగలగాలి. పిల్లల జీవితాల విషయంలో జోక్యం చేసుకోకూడదు. వారికి నచ్చినట్టు వారిని ఉండనివ్వాలి.

అటెన్షన్ కోరుకోకూడదు. బాల్యం, యవ్వనం, మధ్య వయసు ఎలాంటిదో వృద్ధాప్యం కూడా అలాంటిదే. వృద్ధాప్యమనే కారణం చూపెట్టి కొడుకులు, కొడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో పనులు చేయించుకోవాలనే ఆలోచన వదిలిపెట్టేయాలి. సాధ్యమైనంతవరకు మీ పనులను మీరు చేసుకోవడం ఉత్తమం. సాధ్యం కాని పక్షంలో పరిస్థితిని మెల్లగా వివరించి చెప్పాలి కానీ పెద్దవయసు అనే అజమాయిషీ ఉండకూడదు.

పిల్లల పట్ల ప్రేమతో ప్రతీది తమ పొరపాటుగా ఒప్పేసుకోకండి. ఏదైనా సరే చెప్పే విధానంలో ఉంటుంది. తప్పేక్కడుంది అనే విషయాన్ని సున్నితంగా చెప్పి అంతే సున్నితంగా దాన్ని వదిలేయండి. దేన్నీ ఎక్కువగా లాగకూడదు.

వయసయ్యే కొద్ది ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈకాలంలో బిపి, షుగర్ లేని వాళ్లు కేవలం 1% మంది ఉండచ్చేమో. అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తగినంత తేలికపాటి వ్యాయామాలు, కనీస నడక. యోగ, ప్రాణాయామం వంటివి చేయాలి.

మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఎదో ఒకటి తినేయకూడదు. కాస్త తక్కువ ధరల్లోనే పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎంచుకుని తీసుకోవాలి. 

ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు సంతోషంగా ఉంటూ, ఇతరులకు ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించండి. మానసిక ప్రశాంతత చాలా అవసరం సుమా!!

సంతోషం కావాలంటే పెద్ద ఖర్చులు అవుతాయని అనుకోవడం భ్రమ. ఉన్నంతలో చిన్న టూర్ ప్లాన్ చేసుకుని జీవిత భాగస్వామితో కలసి వెళ్ళండి. వృద్ధాప్య దశలోనే ఒకరికొకరు అనే భరోసా, ఆప్యాయత ఎక్కువ ఉండాలి. 

జీవితంలో శాశ్వతమైనదేదీ లేదు.. అలాగే దు:ఖాలు కూడా శాశ్వతం కాదు. ఈ మాటను విశ్వసించండి. చిన్న చిన్న వాటికి బాధపడకుండా ఒత్తిడిని వీలైనంగా దూరం ఉంచండి. 

మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడే అది  అసలైన స్వేచ్చతో జీవించడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

పై విషయాలు కేవలం చదవడం మాత్రమే కాకుండా ఆచరణలో పెడితే వంద శాతం వృద్ధాప్యాన్ని లాహిరి లాహిరి లాహిలో….. అని పాడేసుకుంటూ ఆనందంగా గడిపేయచ్చు మరి.

◆ వెంకటేష్ పువ్వాడ