మన గమనం ఎలా ఉండాలి?

జీవితం తెల్లని కాగితం లాంటిది. అందమైన రంగులతో చక్కగా మలుచుకుంటే గొప్పగా ఉంటుంది. కాదని కుదురైన ఆలోచనలు లేక పిచ్చి గీతలు గీసుకుంటే అర్ధం లేకుండా ఉంటుంది. పాశ్చాత్య పోకడలు మన నవీన నాగరికత పై తద్వారా యువతపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనేది కాదనలేని నిజం. పదవ తరగతి పూర్తయిన విద్యార్థి నుంచి డిగ్రీ విద్యార్థి వరకు తర్వాత ఏం చదవాలి ఎలా ముందుకు వెళ్లాలి అని స్పష్టమైన అభిప్రాయం లేని ఎంతోమందిని మన చుట్టూ చూస్తున్నాం. నిర్దిష్టమైన ఆలోచనలు లేకపోవడమే దీనికి కారణం. 

స్థిరత్వం కావాలి...

ఒక పని లేదా ఒక అంశాన్ని ఎంచుకొన్నపుడు అందులో ఎదో చిన్న సమస్య ఎదురైందని, అయ్యో! ఇది తీసుకోకుంటే బాగుండు ,ఇది ఎంచుకోకుంటే బాగుండు అనే ఆలోచనలు రానివ్వడం ద్వారా మనిషికి తన మీద ఉన్న తన నమ్మకం తెలీకుండా సడలిపోతుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి బద్దకం. ఇది  స్కూల్ స్థాయి నుంచే అలవడటం ప్రమాదం. ఉదాహరణ గా చెప్తే ఒకసారి రాయడం ద్వారా పది సార్లు చదివినట్లు అని చెప్తారు. చెప్పడం కాదు నిజం. అయితే ఇప్పుడు విద్యావ్యవస్థలో నోట్స్ రాసే విద్యార్థులు ఎంతమంది. ఆ స్థానంలో జిరాక్స్ లు వచ్చాయి. శ్రమ లేని చదువు మత్తుని ఇస్తుంది కానీ మనో నిబ్బరాన్ని ఇవ్వలేదు. దీని వలనే ఈరోజు యువత చిన్న కష్టానికే తన పనిని, వృత్తిని, చదువుని పదే పదే మార్చుకుంటూ స్థిరత్వం కోల్పోతున్నాడు. "సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్ధించకు. ఎంతటి కష్టాన్ని అయినా తట్టుకొని నిలబడే శక్తి కోసం ప్రార్ధించు" అంటాడు బ్రూస్లీ. వీలైనంత వరకూ బద్దకానికి దూరంగా ఉండి పోరాడే శక్తిని అలవరుచుకోవడం ఉత్తమం. ఆ విధంగానే మన విద్యా వ్యవస్థ ఉండాలి. అప్పుడే జీవితం కాన్వాస్ పై రంగు కలల అడుగులు పడతాయి.

- వెంకటేష్ పువ్వాడ