హాయ్ బ్రో! - నేను క్షేమమే!

హాయ్ బ్రో! నేను క్షేమమే! ఈ మాటల్ని చూడగానే రెండు వేరు వేరు కాలాలను కలిపి ముడేసినట్లు ఉంది కదా! పాత రోజుల్లో ఎవరికైనా సమాచారాన్ని చేరవేయడానికి జాబులు రాసేవారు. ఇంకా కొంచెం ఎక్కువ విషయం అయితే ఇంగ్లాండ్ కవర్ లో రాసేవారు. అనురాగలను, అభిమానాలను హృదయం పై "ఉభయకుసులోపరి" అంటూ అచ్చేసుకొని మనిషి మమతల్ని ఆవిష్కరించేవి ఆనాటి ప్రత్యుత్తరాలు. 

"నేను క్షేమమే! మీరు క్షేమమే అని తలుస్తున్నా!"
" నాన్న గారికి నమస్కరిస్తూ! వ్రాయునది"
"పెద్దలకు హృదయపూర్వక సుమాంజలి"

ఇలాంటి తొలి తొలి మాటల్లోనే ఎంతటి ద్వేషాన్ని అయినా కరిగించి ప్రేమను కురిపిస్తాయి. అలాంటి మనసు తడి అక్షరాలను మోసుకొచ్చే ఆనాటి జాబు ముక్కలు, తోక లేని పిట్టలు ఈరోజు ఎక్కడ?  కాల
గమనంలో  కనుమరుగయ్యాయి. 

కాలం మారింది
~~~~~~~~

ఇప్పుడు యువత స్మార్ట్ ఫోన్ సాక్షిగా తోకా, పిట్టా రెండూ లేని సమాచారాలు, సందేశాలు గాల్లో తిరుగుతున్నాయి. అక్షరాలు తేలిక అయిపోయాయి. వాట్సప్, ఫేస్బుక్ మెస్సెంజర్స్ ,టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్ లలో  కొన్ని వందల సందేశాలను పంపిస్తున్నారు. సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. కానీ మాటలు ముక్కలై పోతున్నాయి.

"హాయ్ బ్రో హౌ ఆర్ యూ"
"హాయ్ సిస్ ఎలా ఉన్నావ్"

ఇలా మొదలై రాత్రి భోజనం వరకూ మాట్లాడుకుంటారు. సగం సగం మాటలు. షార్ట్ అండ్ కోడ్ సంభాషణలతో షార్ట్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయినట్లు ప్రేమలు కూడా ఎగిరిపోతున్నాయి. ఎంతో విలువైన కాలాన్ని కూడా వృధా చేస్తున్నారు నేటి యువత. ఎదురెదురు కలిసిన మిత్రులను విష్ చేసుకోలేక వాట్సాప్ లో మాట్లాడే వాళ్లని చూస్తున్నాం. మానవ సంబంధాలు ఈ తీరుగా మారడానికి కారణాన్ని ప్రశ్నించుకోవాలి. చాటింగ్ భూతాన్ని కంట్రోల్ చేసుకుని యువత వాస్తవిక ప్రపంచంలోకి రావాలి.

గతాన్ని వర్తమానాన్ని కలిపి ముడి వేయండి. తోకలేని పిట్టల్ని పట్టుకు రండి తల్లిదండ్రులకు ,మిత్రులకు మనసారా ఓ ఉత్తరం రాసి చూడండి. జీవితం కొత్తగా ఉంటుంది.

- వెంకటేష్ పువ్వాడ