స్వామి వివేకానంద మాటల్లో ఆలోచనాశక్తి!!
posted on Aug 26, 2022 12:50PM
భారతీయ యువతకు ప్రేరణగా ఎందరో మేధావులు, గొప్పవారు వున్నారు. అయితే ఒక యువకుడిగా ఉండి ఈ ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మిక మరియు హిందూ ధర్మం గురించి గొంతెత్తి చెప్పినవారు స్వామి వివేకానంద ఆలోచనా శక్తి గురించి ఆయన మాటల్లో…...
పని చేయడం చాలా అవసరం. దానికి మూలం ఆలోచనే కదా! కండరాల ద్వారా కొద్దిగా అభివ్యక్తమైన శక్తిని పని అంటారు. అయితే ఆలోచన లేనిదే ఏ పనీ జరుగదు. కాబట్టి మీ బుద్ధిని ఉన్నతమైన ఆలోచనలతో, అత్యున్నతమైన ఆదర్శాలతో నింపి, రేయింబవళ్ళు వాటిని మీ ముందు ఉంచండి. తత్ఫలితంగా మహోన్నతమైన కార్యాలు సిద్ధిస్తాయి.
ఒక భావాన్ని స్వీకరించండి. దాన్ని మీ జీవిత ధ్యేయంగా చేసుకోండి. దానినే మననం చేయండి, కలగనండి, ఆ భావంలోనే లయించి జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి ఒక్క భాగం ఆ భావంతో పూర్తిగా తాదాత్మ్యం కావాలి. తక్కిన అన్ని భావాలను త్రోసిరాజనండి. ఇదే విజయానికి దారి.
మీరు ఐదు భావాలను జీర్ణం చేసుకొని, వాటిని మీ జీవనంలో, మీ వ్యక్తిత్వంలో సారూప్యాన్ని పొందించు కుంటే ఒక గ్రంథాలయాన్నంతా కంఠస్థం చేసిన వ్యక్తి కంటే, మీకే ఎక్కువ విద్య వచ్చినట్లు!
ఆలోచనే మనలను కార్యోన్ముఖులను చేసే గొప్ప శక్తి. మనస్సును అత్యున్నతమైన ఆలోచనలతో నింపండి. ప్రతి రోజూ వాటిని వినండి. నెలల తరబడి వాటిని గూర్చి ఆలోచించండి. అపజయాలను లక్ష్య పెట్టవద్దు. అవి చాలా స్వాభావికం. ఈ అపజయాలు జీవితానికి అలంకారాలు. అవి లేకుండా జీవితమేమిటి? జీవితంలో పోరాటాలే లేకుండా ఉంటే, ఈ జీవితానికి ప్రయోజనం శ్యూనం.
దురభ్యాసాలను మానాలంటే, వాటికి వ్యతిరేకమైన అభ్యాసాలను అవలంబించటమే ఉపాయం. దుష్టసంస్కార జనిత దురభ్యాసాలను, మంచి అభ్యాసాలతో నిరోధించాలి. అందుకని మీరు ఎప్పుడూ మంచినే చేస్తూ ఉండండి. ఎప్పుడూ పవిత్రమైన ఆలోచనలనే చేస్తూండండి. దుష్ట సంస్కారాలను నిరోధించడానికి ఇదే మార్గం.
ప్రతి వాక్కు, ప్రతి సంకల్పం, ప్రతి చేష్ట. మీకు సంచిత ఫలాన్ని చేకూరుస్తుందన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. చెడు ఆలోచనలు, చెడు పనులు పెద్ద పులుల లాగా మీ పైకి దూకడానికి సిద్ధంగా ఉంటాయి. అయితే ప్రేరణనిచ్చే ఆశ కూడా ఉంది. మంచి ఆలోచనలు, మంచి పనులు, కొన్ని వేల దేవతాగణాల శక్తితో మిమ్మల్ని సదా, సర్వదా రక్షించగలవు. బాల్యం నుండీ సానుకూలమైన, ఉత్సాహకరమైన, బలప్రదమైన, ఆశాజనకమైన ఆలోచనలు వారి (పిల్లల) మెదళ్ళలో ప్రవేశింపనివ్వండి.
భౌతికంగా చూస్తే చెడు ఆలోచనలే వ్యాధిని కలిగించే విషక్రిములు. అంతర్గతంగా ఉన్న భావనే దేహాన్ని రూపొందిస్తుంది. ఒకదేశ ప్రజానీకం, దేశీయ భావాల అభివ్యక్తమే!
మనం పరిశుద్ధులమై, మంచి ఆలోచనలకు ఉపకరణమైతే, అవి మనలో ప్రవేశిస్తాయి. మంచి మనసు చెడు ఆలోచనలను గ్రహించదు. చెడు ఆలోచనలు, చెడ్డ వారిలోనే అనుకూలమైన స్థానాన్ని గుర్తించ గలవు. అవి.
అనుకూల పరిస్థితులలోనే పుట్టి పెరిగి వ్యాపించే సూక్ష్మ క్రిముల వంటివి. ఎప్పుడూ నిరాశతో, నిరుత్సాహంతో జీవించే వారు ఏ పనినీ సాధించలేరు.
◆నిశ్శబ్ద.