సుప్రీంలో నందిగం సురేష్ కు చుక్కెదురు
posted on Jan 7, 2025 2:22PM
మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో బెయిలు కోసం నందిగం సురేష్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు మంగళవారం (జనవరి 7) కొట్టివేసింది. మరియమ్మ హత్య కేసులో పోలీసులు నందిగం సురేశ్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్ కోసం నందిగం సురేశ్ ట్రయల్ కోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఆయన బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురైంది. నందిగం సురేష్ బెయిలు పిటిషన్ ను ట్రయల్ కోర్టు కొట్టి వేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నందిగం బెయిలు పిటిషన్ ను విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను దాచారనే కారణంతో ట్రయల్ కోర్టు నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిందని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం, ట్రయల్ కోర్టు ఆదేశాలలో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంటూ నందిగం సురేష్ బెయిలు పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
ఇంతకీ మరియమ్మ హత్య కేసు ఎప్పటిది అంటే వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ 2020లో హత్యకు గురైంది. అప్పట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ విధానాలను బాహాటంగా విమర్శించిన మరియమ్మ, జగన్ సర్కార్ తన పెన్షన్ ఆపేసిందనీ, ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందనీ విమర్శలు గుప్పించారు. అప్పట్లో జగన్ అరాచకపాలనను ఎవరు విమర్శించినా ప్రభుత్వం, వైసీపీయులూ సహించలేకపోయే పరిస్థితి ఉన్న సంగతి తెలిసందే.
దాంతోనే నందిగం సురేశ్ అనుచరులు మరియమ్మ ఇంటిపై దాడి చేసి ఆమెను తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఈ హత్యపై అప్పట్లో మరియమ్మ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జగన్ హయాంలో పోలీసులు ఆయన ఫిర్యాదును పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన మంత్రి నారా లోకేష్ ను కలిసి తమకు న్యాయం చేయాలంటూ కోరారు. దీంతో లోకేష్ ఆదేశాలతో కేసు దర్యాఫ్తులో వేగం పెంచిన పోలీసులు, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేశారు.