మెట్ గాలాలో మెరిసిన మెఘా సుధారెడ్డి.. ఆమె గౌన్ వెరీ స్పెషల్

అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదిక మెట్ గాలాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్‌ లో  జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక ‘మెట్‌ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గౌనులో  ఆమె మెరిశారు. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితరులు పాల్గొన్నారు.సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాకపోయినా.. మెట్ గాలాలో పాల్గొని సంథింగ్ స్పెషల్ గా నిలిచారు మెఘా సుధారెడ్డి. 

మెట్ గాలా. మెట్ గాలాను ‘మెట్ బాల్’ అని కూడా పిలుస్తుంటారు. కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ గాలా, కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ బెనిఫిట్ అని కూడా అంటారు. గ్లామరస్ గా సాగే ఈ గాలాను ఏదో అవార్డుల కోసమో లేదంటే వినోదం కోసమో నిర్వహించరు. ఇదో ఫండ్ రైజింగ్ ఈవెంట్. సెల‌బ్రిటీలు డిజైన‌ర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ క‌నిపించే మెగా ఈవెంట్ ‘మెట్ గాలా’‌.2021కు గాను  అమెరికాలోని న్యూయార్క్ న‌గ‌రంలో జరిగింది.  ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ లోనే మెఘా  సుధారెడ్డి మెరిశారు. 

సెల‌బ్రిటీలు డిజైన‌ర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ క‌నిపించే మెగా ఈవెంట్‌ ‘మెట్ గాలా’ రెడ్ కార్పెట్‌పై ప్ర‌పంచం న‌లుమూలల నుంచీ సెల‌బ్రిటీలు హొయ‌లు పోతూ ఫొటోల‌కు ఫోజులిస్తారు. వారి అందాలను..సొగసుల్ని కెమెరాల్లో బంధిస్తారు ఫోటో గ్రాఫర్లు. అలాంటి ఈవెంట్‌లో ఈసారి ఇండియా నుంచి  సుధారెడ్డి ఒక్కరే  పాల్గొన్నారు. మెట్‌ గాలాలో సుధారెడ్డి పాల్గొనడం ఇదే తొలిసారి. ఈమె మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ డైరెక్ట‌ర్ కూడా.

ఈ ఏడాది థీమ్‌ ‘అమెరికన్‌ ఇండిపెండెన్స్‌’కు తగ్గట్లు అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్‌ డిజైనర్లు ఫల్గుని, షేన్‌ పీకాక్‌ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గౌనును ఆమె ధరించారు. ఆ గౌన్ సుధారెడ్డి చూపరుల్ని ఆకట్టుకున్నారు. దీని తయారీకి 250 గంటలు పట్టినట్లు డిజైనర్లు తెలిపారు.