ప్రజల కళ్లలో ఆనందం చూడాలి-చంద్రబాబు
posted on Jun 8, 2016 6:32PM

రాష్ట్ర ప్రజల కళ్లలో ఆనందం చూసేవరకు తాను విశ్రమించబోనన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. మహా సంకల్ప యాత్ర సందర్భంగా కడపలో జరిగిన మహా సంకల్ప సభకు సీఎం ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అనంతరం అక్కడకు వచ్చిన ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు..ఈరోజు చేసిన ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరి గుండెల్లో గుర్తుండి పోవాలని ఆయన కోరారు.
రాష్ట్ర విభజనతో మనం చాలా నష్టపోయామని..ప్రస్తుతం అనేక కష్టనష్టాలు అనుభవిస్తున్నా ఒక్కొ అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నామని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, విద్యుత్ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. విద్యుత్ కొరతను చాలా వరకు అధిగమించినట్టు తెలిపారు. రాజధాని అమరావతి కోసం తాను ఇచ్చిన పిలుపు మేరకు రైతులు ఏకంగా 34వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందన్నారు. దీనికి రగిలిన ఏపీ ప్రజలు 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారని..ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పటికీ కోలుకోదన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని బాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.