దేశ భాషలందు తెలుగు లెస్స.. తేనెకన్నా తీయనిది తెలుగు భాష

భాష అంటే ధ్వనుల గుంపు.  వర్ణం అంటే అక్షరం అక్షర అంటే నశించనిది. మాట గాలిలో కలిసి పోవచ్చు కానీ మాట సంకేతమైన అక్షరం మాత్రం చెరిగిపోదు. రంగులతో రాయటం వలన వర్ణం అని రంగులతో పూయటం వలన లిపి అని చెక్కటం గీకటం వలన లేఖం అని పేర్లు వచ్చాయని చరిత్ర చెబుతుంది.

కాని మన పద్యం చేదైపోయింది. సుమతీ శతకాలు బరువైపోయాయి. సుభాషితాలు పిల్లల నోటికి అందడం లేదు. పెద్దబాలశిక్ష శిక్షగా మారిపోయింది. వేల ఏళ్లు ఛందస్సులు, యతి ప్రాసలతో వర్ధిల్లిన భాష ఇప్పుడు ఏటికేటా పదాలు కోల్పోతూ పరభాషల ముందు తలవంచుకు కూర్చుంది. అందుకే తెలుగు భాషను రక్షించుకోవడానికి వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.  

నేడు దేశమంతటా వ్యాపించి ఉన్న అనేక లిపులకు మూలం బ్రాహ్మీలిపి అని కొందరు చిత్ర రూపం లోని మొహొంజొదారో లిపి అని మరికొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. తెలుగు ఆంధ్ర అనే పదాలు పర్యాయపదాలు అయినప్పటికీ క్రీ.శ. 10 వ శతాబ్దం ముందు ఆంధ్ర అనే పదమే పురాణేతిహాసాలలో కనిపించేది నుండి క్రీ.శ.14 శతాబ్ది నుండి తెలుగు తెనుగు అనే పదాలు వాడుకలోకి వచ్చాయి. 

ఆంధ్రాలో ఆర్య సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉండటం వలన సంస్కృత పదజాలం ఎక్కువ!  తెలుగు భాషకు మాతృక  ఐదువేల సంవత్సరాల కిందటి ద్రవిడ శాఖ రెండో భాగానికి చెందిన శాసనాల ఆధారంగా తీసుకుంటే మొదటి తెలుగు శాసనం  క్రీ.శ.575లో కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది అని చరిత్ర చెబుతోంది! సాహిత్య సంపద ఉన్న నాగరిక భాషలలో తెలుగుది అగ్రస్థానం. ఆరవ శతాబ్దినుండి తెలుగులో సాహిత్య మొదలైనట్లు అంచనా. 

లిపి ఉన్నవి లేనివి కలిపి భారతదేశంలో ఉన్న భాషలు 1652 గుర్తింపు పొందినవి 22 ద్రవిడ కుటుంబానికి చెందిన తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో దక్షిణాది భాషలు కాగా ఇండో-ఆర్యన్ కుటుంబానికి చెందిన సంస్కృతం సహా పది భాషలు ఉత్తరాది భాషలు. ద్రావిడ భాషల్లో ప్రాచీనమైనది తమిళం అయినప్పటికీ ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగు. తెలుగు భాషను పద్య గద్య భాగాలుగా విభజించారు! నాటి ఆరవ శతాబ్ద గద్య రూపంలోని తెలుగు భాషకీ నేటి తెలుగు భాషకి వ్యత్యాసం చాలా ఉంది!  తొమ్మిదవ శతాబ్దంలో తెలుగు శాసనాలు రూపం మొదలైంది! ఉదా. అప్పట్లో పణ్డితుడు అనే వారు ఇప్పుడు పండితుడు అంటున్నారు. 

తెలుగు కావ్య పరిమాణంలో కవిత్రయం నన్నయ తిక్కన ఎర్రన మహాభారతాన్ని రసరమ్యంగా హృదయానికి హత్తుకునేలా స్వేచ్ఛానువాదం తో కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. భక్తుల గాధలను తత్వ బోధలు ఆరాధనా విధానాలు ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరిచి భగవంతుడికి భక్తుడికి మధ్య భక్తి యోగాన్ని చాటే భాగవతాన్ని తెలుగులో రచించారు మహాకవి పోతన. 

"దేశభాషలందు తెలుగు లెస్స" అని పలికి ఒక చేత ఖడ్గం మరో చేత కలం పట్టి తన ఆస్థానంలో అష్ట దిగ్గజాలుగా (అల్లసాని పెద్దన నంది తిమ్మన ధూర్జటి మాదయ్యగారి మల్లన అయ్యలరాజు రామభద్రుడు పింగళి సూరన రామరాజభూషణుడు తెనాలి రామకృష్ణుడు)  పేరొందిన ఎనిమిది మంది తెలుగు కవులను పోషించారు- విజయనగర సామ్రాజ్య రాజులు శ్రీ కృష్ణదేవ రాయలు. వికటకవిగా పేరొందిన తెనాలి రామకృష్ణుడి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇంగితం జ్ఞానం హాస్యం కలగలిపిన వారి భాష అద్భుతం. 

వ్యాకరణానికి ప్రామాణిక గ్రంధంగా బాలవ్యాకరణం రచించిన మహాకవి చిన్నయసూరి. కంచర్ల గోపన్న శ్రీరామునిపై 17వ శతాబ్దంలో రచించిన భక్తి "దాశరధీ శతకం".  సూటిగా సుత్తి లేకుండా తేటగా చెప్పిన "వేమన శతకం" మంచి మాటలు నేర్పే "సుమతీ శతకం" మానవునికి సంబంధించిన వివిధ గుణాలను వివరిస్తూ రచనలు చేసిన భర్తృహరి సుభాషితాలు. తెలుగు భాషలోని కచిక ప్రత్యేకత. మొదటి నుంచి చివర వరకు చదివితే రామాయణం వస్తుంది చివరి నుంచి మొదటి వరకు చదివితే మహాభారతం వస్తుంది. 

తెలుగు సాహిత్యాన్ని శాసించిన విప్లవ కవి శ్రీశ్రీ కవితల్లో ప్రాస శ్లేష శ్రీ శ్రీ సొంతం.అష్టావధానం తెలుగుకి మాత్రమే సొంతం. కోడిపిల్ల అనే పాట వింటే ఊపు వస్తుంది అదే పల్లెటూరి జానపదం .. మునెయ్య ప్రసిద్ధి. వింటుంటే వినాలి వినాలనిపించేది.. చదువుతుంటే చదవాలనిపించేది.. మన కమ్మనైన తెలుగు భాష. 

కాని ప్రపంచీకరణ వలన పిల్లలను ఆంగ్ల మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి, లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ప్రత్యేకించి టెలివిజన్ మాధ్యమాలలో పరభాష పదాల వాడుక పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మృతభాషగా మారే ప్రమాదమున్నది. ఐక్యరాజ్యసమితి విద్య సాంస్కృతిక సంస్థ 1999/2002-12 తీర్మానంలో ప్రపంచంలోని 6000 భాషలలో 3000 కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి భారతదేశంలో కేవలం 5 భాషలు (హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం) మిగులుతాయని పేర్కొన్నారు.

అమ్మతో కష్టసుఖాలు చెప్పుకునే భాష నోటికి బరువైపోతోంది. కొత్త పదాల సృష్టి కరువైపోతోంది. ఒకప్పుడు ఆకాశ మార్గాన ఉన్న భాషను నేలకు దించి సాహిత్యాన్ని సామాన్యులకు చేరదీసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి నేడు. భాష కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. వేడుకలు బాగానే ఉన్నాయి గానీ ఏ ఉద్దేశంతోనైతే గిడుగు పోరాటం చేశారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. వెన్న కన్నా మెత్తనైన తెలుగు భాష వర్తమానంలో పతనావస్థ అంచులపై వేలాడుతోంది. తెలుగు వెలుగులు మసక బారకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడిపై ఉంది.