ఒకే కానుపులో నలుగురు పిల్లలు.. కంటికి రెప్పల్లా కాపాడిన నీలోఫర్ వైద్యులు
posted on Mar 30, 2025 7:37AM

కేవలం హైదరాబాద్ నగరమే కాదు.. యావత్ తెలంగాణ, ఆ మాటకొస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏ పసిపాపకు ఆరోగ్యం బాగా లేకపోయినా.. ఆ పాప తల్లిదండ్రులకు వెంటనే గుర్తొచ్చే హాస్పిటల్ నీలోఫర్. ఆస్పత్రులు దేవాలయాలు, డాక్టర్లు దేవుళ్లు అన్న ప్రజల విశ్వాసం ఇటీవలి కాలంలో సన్నిగిల్లుతోంది. ధనార్జనే ధ్యేయంగా రకరకాల పరీక్షలు అంటూ ప్రజల జేబులు కొల్లగొడుతున్న కార్పొరేట్ ఆస్పత్రులు, నిర్లక్ష్యం నీడన వైద్యం కోసం వచ్చే వారి పట్ల ఆమానుషంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాస్పత్రుల కారణంగా ఆస్పత్రులను దేవాలయాలుగా, వైద్యులను దేవుళ్లుగా భావించే పరిస్థితి క్రమంగా తగ్గిపోతున్నది.
అయితే ప్రజలలో ఆస్పత్రుల పట్ల, వద్యుల పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా నీలోఫర్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్నాయి. తల్లీ బిడ్డల ఆరోగ్య అవసరాలు తీర్చడమే లక్ష్యంగా 1953లో ఏర్పాటైన నీలో ఫర్ ఆస్పత్రి అప్పటి నుంచీ ఆదే ఆశయం, స్ఫూర్తితో పని చేస్తున్నది.
తాజాగా హైదరాబాద్‌లోని హస్తినాపూర్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ నెలలు నిండకుండానే పురిటి నొప్పులు రావడంతో నీలోఫర్ ఆస్పత్రికి గత 22న వచ్చింది. ఏడున్నర నెలల గర్భధారణ సమయంలో అకాల ప్రసవ నొప్పులతో బాధపడుతున్న ఆమెకు ఆదే రోజు అక్కడి వైద్యులు సిజేరియన్ ద్వారా కనుపు చేశారు నీలోఫర్ వైద్యులు. ఆమె నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఇద్దరు ఆడశిశువులు కాగా ఇద్దరు మగశిశువులు. దీనిని క్వాడ్రాపుల్ ప్రెగ్నెన్సీ అంటారు. ఆమెకు జన్మించిన పిల్లల బరువు తక్కువగా ఉన్నారు. అకాల ప్రసవం కారణంగా ఆ శిశువులకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వెంటిలేటర్ పై ఉంచాల్సిన పరిస్థితి. నీలోపర్ ఆస్పత్రి సూపరింటెండెంట్, నియోనాటాలజీ విభాగం చీఫ్ ల పర్యవేక్షణలో ఆ నలుగురు శిశువులనూ ఆస్పత్రిలోని ఎన్ఐసీయూలో చేర్చి వైద్య సేవలు అందించారు.
దాదాపు పది రోజుల పాటు వారిని మెకానిక్ వెంటిలేటర్ లో ఉంచారు. మొదటిలో నలుగురు శిశువులకూ తల్లి పాలు సరిపోయేవి కాదు. దీంతో ఆస్పత్రిలోని హ్యూమన్ బిల్క్ బ్యాంక్ సహాయంతో పిల్లలకు పాలు అందించారు. రోజులు గడిచే కొద్దీ పిల్లల ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో వారిని ఎన్ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చారు. పిల్లల బరువు కూడా పెరిగింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులూ తగ్గాయి. సెప్సిస్, కామెర్లు, అప్నియా, ఆర్‌ఓపి వంటి సమస్యలతో బాధపడిన ఆ నవజాత శిశువులను వైద్యులు కంటికి రెప్పల్లా కాపాడారు. వారిలో ఒక శిశువు కంటికి ఆపరేషన్ కూడా చేయాల్సి వచ్చింది. ఇలా అన్ని సమస్యలనూ ఒక్కటొక్కటిగా అధిగమించి పిల్లల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచారు. దాదాపు నెల రోజులపైన ఆస్పత్రిలో ఆ శిశువులకు వైద్య సేవలు అందించిన తరువాత శనివారం (మార్చి 29) డిశ్చార్జ్ చేశారు. ఇప్పటికీ పిల్లలు కొంత తక్కువ బరువుతోనే ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా ఇబ్బందులేవీ లేవని వైద్యులు చెప్పారు. ఇప్పుడు నలుగురు శిశువులకూ తల్లి పాలు అందుతున్నాయనీ తల్లీ, నలుగురు పిల్లలూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని నిర్ధారించుకున్న తరువాతే డిశ్చార్జ్ చేశామని నీలోఫర్ వైద్యులు తెలిపారు.