ఎన్టీఆర్ సక్సెస్ సీక్రెట్స్ చెప్పిన సీజేఐ జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ 

దివంగత నందమూరి తారకరామారావు. తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. అటు సినిమా రంగం ఇటు రాజకీయ రంగాన్ని ఉపేశారాయన. రెండు దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని ఏలిన ఎన్టీవోడు రాజకీయ రంగ ప్రవేశం చేసి.. కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంం చేపట్టారు. అంతేకాదు పాలనలో కొత్త ఒరవడి స్పష్టించి పేదల గుండెల్లో నిలిచిపోయారు. సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్ అని అంటారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఆయన సాగించిన పాలన పేద ప్రజలకు వరమని చెబుతారు. ఇప్పటికి తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ నిలిచి ఉన్నారంటే.. ఆయన వాళ్లతో ఎంతగా మమమేకమయ్యారో తెలుసుకోవచ్చు. 

దేశంలో కాంగ్రెస్ హవా సాగుతున్న రోజుల్లో, ఐరన్ లేడీ ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టడమే సంచలనమైతే... 9 నెల్లల్లోనే అధికారంలోకి రావడం దేశ వ్యాప్తంగా పెను సంచలనం..  దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో రాణించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న సినీ నేప‌థ్య‌మే కార‌ణ‌మ‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ మాత్రం అసలు విషయం చెప్పారు. ‘వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం’ సంయుక్తంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సదస్సులో  వర్చువల్ గా మాట్లాడిన జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ,ఆయన విజయ రహస్యానికి సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో రాణించ‌డానికి, ఆయ‌న తెలుగు భాషా ప్రావీణ్యానికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. 

‘నందమూరి తారక రామారావుగారు అగ్రశ్రేణి సినీనటుడు కావ‌డం వ‌ల్లే ఆయన సులువుగా అధికారంలోకి వ‌చ్చార‌ని సాధారణంగా అందరూ అభిప్రాయపడుతుంటారు. ఆనాటి రాజకీయ పరిస్థితులు ఆయనకు కచ్చితంగా అనుకూలించాయి. అందులో సందేహం లేదు. కానీ, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉంది. ఊరారా తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో అద్భుత ఉచ్ఛారణతో అనర్గళంగా ప్రసంగించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఆయన వాక్చాతుర్యం ఆయన విజయంలో కీలక పాత్ర పోషించింది’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. 

భాష గొప్ప‌త‌నాన్ని చాటి చెప్పేందుకు జస్టిస్ ఎన్వీ రమణ ఈ ఉదాహ‌ర‌ణ చెప్పారు. ప్ర‌జ‌ల్ని మాతృభాష ఎంత‌గా ప్ర‌భావితం చేస్తుందో ఎన్టీఆర్ రాజ‌కీయ విజ‌యాన్ని ఆయ‌న ఉద‌హ‌రించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ఇదే స‌మావేశంలో మాతృభాష విశిష్ట‌త గురించి ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదని హెచ్చ‌రించారు. ప్రతి ఒక్కరూ అమ్మభాషను మాట్లాడడం ఓ గౌరవంగా భావించాలని పిలుపునిచ్చారు. ఇంగ్లీషు మోజులో పడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం తగదని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ హిత‌వు ప‌లికారు.