తెలుగుకి సంస్కృతానికి తేడా తెలియని వైసీపీ.. భాషను నాశనం చేసేందుకే కంకణం..

తెలుగు, సంస్కృతానికి తేడా తెలియని వైసీపీ పాలనలో గిడుగు రామ్మూర్తి ఆకాంక్షలు నీరుగారిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషను నాశనం చేసేందుకే కంకణం కట్టుకున్నట్టుగా ప్ర‌భుత్వం వ్యవహరిస్తోంద‌ని మండిప‌డ్డారు. వైసీపీ పాల‌న‌ నుంచి అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారిపైనా ఉందన్నారు. బోధనా భాషగా, పాలనా భాషగా ఉన్నప్పుడే ఏ భాషకైనా మరింత రాణింపు ఉంటుందని.. తెలుగు భాషకు ఆ ప్రాప్తం లేకుండా జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం చేస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు చంద్ర‌బాబు.

తెలుగునాట వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషుడైన గిడుగు రామ్మూర్తి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్న ప్రపంచంలోని తెలుగువారందరికీ చంద్రబాబు, నారా లోకేశ్‌లు శుభాకాంక్షలు తెలిపారు. వాడుకలోని తెలుగు భాష ద్వారా ప్రపంచ సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం సామాన్యుల చేతికి వచ్చేందుకు మూలకారణం గిడుగు రామ్మూర్తేనని చంద్రబాబు అన్నారు. ప్రజలలో అక్షరాస్యత పెరగాలంటే మాతృభాషలోనే బోధన జరగాలని ఆయన విశ్వసించారని గుర్తుచేశారు.

 

గిడుగు రామ్మూర్తి కృషి వల్లే ఆ కాలంలో ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు, రచన వాడుక భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చాయని నారా లోకేశ్‌ అన్నారు.  తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం నుంచి.. పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు తెలుగు భాష వ్యాప్తి, సంరక్షణకు నడుం కట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్ర‌బాబు గుర్తు చేశారు.