కేటీఆర్ కు అక్బరుద్దీన్ కౌంటర్.. కాపాడిన హరీశ్ రావు
posted on Sep 29, 2015 4:45PM
తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు రైతుల ఆత్మహత్యలపై చర్చ జరుపుతున్న నేపథ్యంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ప్రతిపక్షాలన్నీ కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతు ఆత్మహత్యల అంశంపై ఇరుకున పెడదామని అనుకున్న నేపథ్యంలో ఆపని ఒక్క అక్బరుద్దీనే చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై అక్బరుద్దీన్ మాట్లాడుతూ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మూడు ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది అంటున్నారు.. ప్రతి ప్రాంతంలో పంట పొలాలకు నీరందితే అత్మహత్యలు ఎందుకు చేసుకుంటారని నిలదీశారుయ. అయినా రైతుల ఆత్మహత్యలను ప్రకృతి మీద నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు.. మరి వర్షాలు పడిన ప్రాంతంలో రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని ప్రశ్నించారు. అంతేకాదు ఏ మంత్రి నియోజక వర్గంలో ఎంత మంది రైతులు చనిపోయారో కూడా చెప్పారు.
కేటీఆర్ నియోజకవర్గంలో 18 ఆత్మహత్యలు - ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో 15 - హరీష్ రావు నియోజకవర్గంలో 11 - చందూలాల్ నియోజకవర్గంలో 11 మంది - మహేందర్ రెడ్డి నియోజకవర్గంలో 10 - జూపల్లి ప్రభాకర్ నియోజకవర్గంలో 10 - లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో 15 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు దీంతో మంత్రులు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు.
అయితే అక్బరుద్దీన్ రైతు ఆత్మహత్యల గురించి మాట్లడుతున్న సమయంలో టీఆర్ఎస్ నాయకులు నవ్వుతుండగా.. అక్బరుద్దీన్ నేను రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతుంటే మీకు నవ్వు వస్తుందా.. మీ వ్యవహారాన్ని ప్రజలు చూస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఐటీ మంత్రి కేటీఆర్ కల్పించుకొని మేమేమి నవ్వడంలేదు..రైతుల ఆత్మహత్యలపై మేము కూడా సీరియస్ గానే ఉన్నామని.. మీరేం మాట్లాడినా సూటిగా మాట్లాడాలని అన్నారు. దీనికి అక్బరుద్దీన్ కూడా కేటీఆర్ కు ఘాటుగా సమాధానమిచ్చారు. తామేమి సూటిగా మాట్లాడలేదో చెప్పండి అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. అంతేకాదు కేటీఆర్ అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీ నేతలకు చెప్పుకోండి అంటూ చురకలు అంటించారు. దీంతో కేటీఆర్ కు ఏం సమాధానం చెప్పాలో తెలియక అవస్తపడుతుండగా ఇంతలో హరీశ్ రావు కల్పించుకొని ఒక్క నేతకు ఇంత సమయం ఇస్తే ఎలా అంటూ స్పీకర్ ను కోరడంతో స్పీకర్ అక్బరుద్దీన్ ను త్వరగా ముగించాలని కోరారు. మొత్తానికి బావ పడుతున్న అవస్త చూసి హరీశ్ ముందే తేరుకొని చాలా చక్కగా పరిస్థితిని చక్కదిద్దారు.