అక్బరుద్దీన్ ఓవైసీ - మంత్రి కేటీఆర్ మధ్య గొడవ
posted on Sep 29, 2015 4:15PM
తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, ఐటీశాఖా మంత్రి కేటీఆర్ మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది, తాను మాట్లాడుతుండగా కొందరు సభ్యులు నవ్వుతున్నారంటూ అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తంచేయడంతో వివాదం మొదలైంది. అంతేకాకుండా రైతు ఆత్మహత్యలపై మీడియాలో వస్తున్న వార్తలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఓవైసీ చేసిన విమర్శలపై తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్.... మీడియా కోసమో, ప్రజలను అట్రాక్ట్ చేయడం కోసమో అక్బరుద్దీన్ మాట్లాడుతున్నట్లుందని కౌంటర్ ఇచ్చారు. పెద్ద గొంతేసుకుని మాట్లాడినంత మాత్రాన అవన్నీ నిజాలైపోవని అన్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు అక్బర్ తీవ్ర అభ్యంతరం చెప్పారు, స్పీకర్ అధికారాలను కేటీఆర్ తీసుకుంటున్నారని విమర్శించారు, దానికి కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చిన కేటీఆర్... రైతు ఆత్మహత్యల సమస్యపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, మిగతా పక్షాలు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, అక్బర్ వ్యాఖ్యలపైనే వివాదం వచ్చిందన్నారు, అయితే ఎంఐఎం, టీఆర్ఎస్ పరోక్షంగా మిత్రపక్షాలంటూ బీజేపీ విమర్శలు చేసిన తరుణంలో అక్బర్-కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరగడంతో ఈ రెండు పార్టీల మధ్యా ఎక్కడో సత్సంబంధాలు దెబ్బతిన్నాయేమోనని చెవులు కొరుక్కుంటున్నారు.