అన్నదాతల ఆత్మహత్యల్ని అవమానించేలా నివేదిక
posted on Sep 28, 2015 5:55PM
ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలు, తెలంగాణ రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడతాయన్న నమ్మకం, తమ ఆశలను, ఆకాంక్షలను కేసీఆర్ లో చూసుకున్నారు, ఆయనొస్తేనే తమ బతుకులు మారతాయని నమ్మారు, అధికారం కట్టబెట్టారు, ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు; ఒకవైపు కేసీఆర్ గద్దెనెక్కి ఏడాదిన్నర దాటిపోతుంటే, మరోవైపు రైతన్నల బతుకులు తెల్లారిపోతున్నాయి, పంటనష్టం, రుణభారం, వ్యవసాయ సంక్షోభంతో అన్నదాతల గుండెలు ఆగిపోతున్నాయి, అయితే రైతుల ఆత్మహత్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం శంకిస్తుండటంతో బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి
తెలంగాణ ఏర్పాటై, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గద్దెనెక్కాక 1000మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, 689 కేసులు మాత్రమే ప్రభుత్వం దష్టికి వచ్చాయి, వాటిలో 595 ఆత్మహత్యలను పరిశీలించిన త్రిసభ్య కమిటీ...312 మాత్రమే రియల్ సూసైడ్స్ అని తేల్చింది, వీటిలో కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లోనే అత్యధికంగా ఉన్నాయని, 168మంది ఆత్మహత్యలు చేసుకున్నారని నమోదైతే వాటిలో 78 నిజమైనవని తేల్చింది, ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 79 కేసులు నమోదైతే 64, వరంగల్ జిల్లాలో 96 కేసులు రికార్డయితే 51 మాత్రమే నిజమైనవని తేల్చగా, 61 కేసులు నమోదైన నిజామాబాద్ జిల్లాలో రెండు మాత్రమే రియల్ సూసైడ్స్ చెప్పింది, అయితే త్రిసభ్య కమిటీ తేల్చిన 312 ఆత్మహత్యల్లో ఇప్పటికే 295మందికి ప్రభుత్వం పరిహారం అందించిందని, రుణభారం, పంట నష్టం వంటి కారణాలతో వీరంతా ఆత్మహత్యలకు పాల్పడ్డారని రిపోర్ట్ ఇచ్చింది.
రికార్డుల ప్రకారం సుమారు 700 ఆత్మహత్యలు నమోదు కాగా, వాటిలో సగం కూడా నిజం కాదని త్రిసభ్య కమిటీ తేల్చడంపై బాధిత రైతు కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి, తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన బలిదానాలపై ఇలాంటి ఆరోపణలే చేస్తే, తీవ్రంగా స్పందించిన టీఆర్ఎస్...ఈనాడు రైతుల ఆత్మహత్యలను అవహేళన చేస్తోందని మండిపడుతున్నారు, సొంత పాలకుల చేతిలోనూ అవమానాలే ఎదురవుతున్నాయని వాపోతున్నారు.
ఇదిలాగుంటే తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, రోజురోజుకీ సూసైడ్స్ పెరిగిపోతుండటంతో కేసీఆర్ కి కంటి మీద కునుకు కరువైంది, మరోవైపు రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే సెకండ్ ప్లేస్ లో ఉండటం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆందోళన కలిగిస్తోంది