వెయ్యిమంది బలిదానాలు చేసుకొన్నారు: కెటిఆర్
posted on May 29, 2015 10:20AM
.jpg)
తెలంగాణా పాఠ్య పుస్తకాలలో రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాల గురించి, తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురించి ప్రస్తావన లేనందుకు టీ-కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు చాలా ధీటుగా సమాధానం చెప్పారు. తెలంగాణా ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆలశ్యం చేయడం వలననే అనేక వందలమంది బలిదానాలు చేసుకొన్నారని, ముఖ్యంగా 2009లో తెలంగాణా ఇస్తామని యూపీయే ప్రభుత్వం ప్రకటించి మాట తప్పడంతో సుమారు 1000 మందికి పైగా యువకులు బలిదానాలు చేసుకొన్నారని, అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి పుస్తకాలలో ఏమని వ్రాయమంటారు? అని ఎదురు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి భలే సమాధానం ఇచ్చిన కెటిఆర్ బలిదానాల గురించి నోరు జారి కాంగ్రెస్ పార్టీకి దొరికిపోయారనే చెప్పాలి. తెలంగాణా ఉద్యమం చాలా ఉదృతంగా సాగుతున్న సమయంలో కనీసం 1200 మందికి పైగా యువకులు బలిదానాలు చేసుకొన్నారని తెరాస నేతలే చెప్పేవారు. కానీ ఇప్పుడు మంత్రి కెటిఆర్ వారి సంఖ్య1000కి పైగా ఉంటుందని చెపుతున్నారు. కానీ తెలంగాణా ప్రభుత్వం కేవలం 452మందిని మాత్రమే అమరవీరులుగా మాత్రమే గుర్తించింది? స్వయంగా కె. తారక రామారావే 1000 మందికి పైగా యువకులు బలిదానాలు చేసుకొన్నారని ద్రువీకరిస్తున్నప్పుడు, తెలంగాణా ప్రభుత్వం మిగిలిన అమరవీరుల కుటుంబాలను ఎందుకు పట్టించుకోలేదు?ప్రభుత్వం పట్టించుకోకపోతే, అందులో మంత్రిగా ఉన్న ఆయనైనా మిగిలినవారికి కూడా ఆర్ధిక సహాయం చేయాలని ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? అనే ప్రశ్నలు రేపు కాంగ్రెస్ నుండి ఆయన ఎదుర్కోవలసి రావచ్చును.