కేకే పై శైలజానాథ్ వ్యంగ్యాస్త్రాలు

హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన తమ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావుపై సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తాను కేశవరావు అంతటి మేధావినీ కాను, నిబద్ధత కలిగినవాణ్మీ కాను అని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ నెల 12వ తేదీన పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో జరిగే సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మరోసారి తాము డిమాండ్ చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన అంశంపై చర్చల కోసం ఈ నెల 12వ తేదీన తమ వద్దకు రావాలని గులాం నబీ ఆజాద్ సీమాంధ్ర ప్రతినిధులను అహ్వానించారు. తెలంగాణ, సీమాంధ్ర నాయకులతో ఆజాద్ గత కొంత కాలంగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ శస్త్తచికిత్స కోసం అమెరికా వెళ్లడంతో చర్చలు ఆగిపోయినట్లు కనిపిస్తోంది. తిరిగి ఆమె ఢిల్లీకి చేరుకోగానే గులాం నబీ ఆజాద్ చర్చలు ప్రారంభించినట్లు చెప్పవచ్చు.