నాజీలను మించి జగన్ రెడ్డి అరాచకాలు!
posted on Jun 24, 2021 11:01AM
మొన్న కడప జిల్లా.. నిన్న కర్నూల్ జిల్లా.. తాజాగా ప్రకాశం జిల్లా... ఏపీలో హత్యా రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలు బలవుతున్నారు. రోజు ఏదో ఒక చోటు అధికార పార్టీ నేతలు , కార్యకర్తలు తెగబడుతూనే ఉన్నారు, టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో వైసీపీ దాడులు తీవ్రమయ్యాయి. వారం క్రితం కర్నూలు జిల్లాలో వైసీపీ-టీడీపీ మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మరుక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ-వైసీపీ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. సంతమాగులూరు మండలం కామేపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, ఇనుప రాడ్లతో టీడీపీ, వైసీపీ వర్గాలు దాడికి దిగాయి. ఈ ఘర్షణలో టీడీపీ వర్గీయుడు లక్కిపోగు సుబ్బారావు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దాడిలో గాయపడిన వారి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
ఏపీలో జరుగుతున్న దాడుల ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ప్రశాంత పరిస్థితులు నెలకొనగా.. వైసీపీ అధికారంలోకి వచ్చాకే మళ్లీ విష సంస్కృతి పెరిగిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ హీటెక్కిస్తున్నాయి. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్‌ను వైసీపీ హత్యాంధ్రప్రదేశ్‌గా మార్చిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను వేధించడమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అన్ని విధాలా అండగా వుంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల ప్రాణాలకు రక్షణలేదన్నారు అచ్చెన్నాయుడు. పరిశ్రమలతో కళకళలాడాల్సిన నవ్యాంధ్ర.. దాడులు, హత్యలతో విలవిల్లాడుతోందన్నారు. రాష్ట్రంలో జరిగే అరాచకం సీఎం కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జర్మనీలో నాజీల దురాగతాలకు మించి ఏపీ సీఎం జగన్ రెడ్డి అరాచకాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రోజులెప్పుడూ తమవే ఉండవని జగన్ రెడ్డి గూండాలు గుర్తుంచుకుంటే మంచిదని హెచ్చరించారు. అధికారంలోకొచ్చాక 27 మంది టీడీపీ కార్యకర్తలను బలితీసుకున్నారని మండిపడ్డారు. ఇన్ని హత్యలు, దాడుల జరుగుతున్నా డీజీపీ కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హత్యల్లో పాత్రులైన వారిలో ఒక్కరినైనా పట్టుకుని శిక్ష విధించారా అని నిలదీశారు. ఇష్టానుసారంగా తమ కార్యకర్తలపై దాడులకు తెగబడతామంటే చూస్తూ ఊరుకోమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.