టీడీపీకి ఝలక్.. సైకిల్ గుర్తు తొలగించండి

 

ఏపీలో ఎన్నికలకు ముందు అధికార పార్టీ టీడీపీకి ఝలక్ ల మీద ఝలక్ లు తగులుతున్నాయి. ఓ వైపు డేటా లీక్ ఆరోపణలతో సతమవుతుంటే.. మరోవైపు టీడీపీ గుర్తుగా సైకిల్ ని తొలగించండి అంటూ కొత్త డిమాండ్ తెరమీదకు వచ్చింది. టీడీపీ ఇంత‌కుముందు ప్రాంతీయ పార్టీ. కానీ ఇప్పుడు జాతీయ పార్టీ. ఆల్రెడీ గా జాతీయ పార్టీగా ఉన్న స‌మాజ్ వాదీ పార్టీ గుర్తు కూడా సైకిలే. కాబ‌ట్టి రెండు జాతీయ పార్టీల‌కు ఒకే గుర్తు ఉండ‌రాదు. అందువ‌ల్ల స‌మాజ్ వాదీ పార్టీ త‌ర్వాత స్థాపించ‌బ‌డ్డ టీడీపీ గుర్తు తొల‌గించాల‌ని కొంద‌రు లాయ‌ర్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఇప్పుడు టీడీపీ పోటీచేస్తున్నందున‌ టీడీపీ, సమాజ్‌వాదీ పార్టీలకు ఒకేగుర్తును ఎలా కేటాయిస్తారని ఏపీ న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు కేఎంజేడీ శ్యామసుందరి ఎన్నిక‌ల సంఘాన్ని ప్రశ్నించారు. ఫిర్యాదు అనంత‌రం ఈ విష‌య‌మై ఆమె మీడియాతో మాట్లాడారు. రెండు జాతీయ పార్టీల‌కు ఒకే ఎన్నిక‌ల గుర్తు ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. టీడీపీకి సైకిల్‌గుర్తును తొలిగించాలని డిమాండ్ చేశారు. త్వరలో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీల వివరణ కోరాలని ఈసీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. అయితే ఈ ఫిర్యాదు వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీని ఇబ్బంది పెట్టడానికే కొన్ని రాజకీయ పార్టీలు ఆమె వెనకుండి ఇలా డ్రామాలు ఆడుతున్నాయని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.