బిగ్ షాక్.. రాఫెల్ డీల్ కీలక పత్రాలు చోరీ!!

 

రాఫెల్ డీల్ వ్యవహారంలో పునఃసమీక్షపై సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. డీల్‌లో ఎలాంటి అవినీతీ జరగలేదంటూ మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇస్తూ గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును రీకాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్‌పై అత్యున్నత ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పెద్ద బాంబు పేల్చారు. రాఫెల్ డీల్ కి సంబంధించిన కీలక పత్రాలు ఇటీవల రక్షణ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ప్రస్తుతం రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలని సుప్రీం కోర్టును కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్‌ స్పందిస్తూ.. పత్రాల చోరీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఆదేశించారు. అంతకుముందు, సీనియర్ లాయర్ ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు. డిసెంబరు 14, 2018న రాఫెల్ పై ఇచ్చిన తీర్పులో చాలా తప్పిదాలు ఉన్నాయని, తప్పుడు సమాచారం ఇచ్చి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

అసలే మోదీ సర్కార్ రాఫెల్ డీల్ విషయంలో పలు విమర్శలు ఎదుర్కొంటుంది. మరోవైపు మాకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని సంబరాలు చేసుకుంది. ఇప్పుడు సీన్ చుస్తే టోటల్ రివర్స్ అయింది. ఏకంగా రాఫెల్ డీల్ కి సంబంధించిన కీలక పత్రాలు పోయాయంటూ బాంబు పేల్చింది. ఎన్నికలకు ముందు విపక్షాలకు మంచి ఆయుధాన్ని ఇచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పటి నుండో రాఫెల్ పేరుతో మోదీ సర్కార్ మీద విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాఫెల్ డీల్ పత్రాల మిస్సింగ్ తో రాహుల్ మోదీ మీద ఏ స్థాయిలో విరుచుకు పడతారో చూడాలి.