అమిత్ షాతో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు భేటీ.. కారణమేంటో తెలుసా?
posted on Mar 26, 2025 12:03PM

తెలుగుదేశం ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం (మార్చి 25) భేటీ అయ్యారు. సాధారణంగా అయితే ఇటువంటి భేటీలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ లావు శ్రీకృష్ణ దేవరాయులు అమిత్ షాతో భేటీ అయిన సమయం, అంతకు ముందు రోజు అంటే సోమవారం (ఫిబ్రవరి 24) లోక్ సభలో లావు ప్రసంగం తరువాత అమిత్ షాతో ఆయన భేటీ కావడం రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా ఆయన పలు పత్రాలను అమిత్ షాకు అందజేయడమే కాకుండా వాటికి సంబంధించిన విషయాలను వివరించారు.
లావు ఇచ్చిన పత్రాలను అమిత్ షా కూడా ఆసక్తిగా చూశారనీ, ఆయన వివరణలను శ్రద్ధగా విన్నారనీ తెలుస్తోంది. అయితే ఈ పత్రాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అందించాల్సిన సహాయ సహకారాలకు సంబంధించినవి కావని పరిశీలకులు అంటున్నారు.
సోమవారం (మార్చి 24) లోక్ సభలో లావు శ్రీకృష్ణ దేవరాయులు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణానికి సంబంధించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీ మద్యం కుంభకోణం ఎన్నో రెట్టు పెద్దదని పేర్కొన్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయలను అక్రమంగా ఢిల్లీకి తరలించారనీ, దీని వెనుక వైసీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఉన్నారనీ లావు ఆరోపించారు. అంతే కాకుండా ఏపీ మద్యం కుంభకోణంపై ఈడీ విచారణకు ఆయన డిమాండ్ చేశారు.
ఇది జరిగిన మరుసటి రోజే అంటే మంగళవారం (మార్చి 25)న లావు శ్రీకృష్ణ దేవరాయులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడమే ఈ ప్రాధాన్యతకు కారణం. ఈ భేటీలో లావు శ్రీకృష్ణ దేవరాయులు.. లోక్ సభలో తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అమిత్ షాకు అందజేయడమే కాకుండా మరో సారి ఈడీ దర్యాప్తు డిమాండ్ ను గట్టిగా చేశారనీ ఏపీ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.