కొలికపూడి యాక్షన్ ఓవర్ అయ్యిందా?

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హడావుడి చేస్తున్నారు. ఓ గిరిజన మహిళ పై లైంగిక వేధింపుల ఆడియో ఇటీవల సంచలనంగా మారింది. ఆ గిరిజన మహిళను వేధించిన రమేష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ కొలికపూడి డిమాండ్.  గంటల్లో రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని  అల్టిమేటం జారీ చేశారు. టీడీపీ  అధిష్ఠానానికి 48 గంటల డెడ్‌లైన్‌ విధిస్తూ అల్టిమేటం జారీ చేసిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యల దుమారం కాక రేపింది. 

కొలికపూడి యాక్షన్‌పై అధిష్ఠానం వెంటనే రియాక్ట్‌ అయ్యింది. టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ను రంగంలోకి దింపిన రాష్ట్ర నాయకత్వం వెంటనే నివేదిక కోరింది. ఏఎంసీ మాజీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డిపై ఆరోపణలు, ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలపై ఆయన వివరాలు సేకరించి అధిష్ఠానానికి నివేదిక పంపారు. అంతేకాదు.. రాష్ట్ర కార్యాలయం నుంచి తిరువూరు నాయకులకు ఫోన్లు వస్తుండటంతో ఇక్కడి రాజకీయంపై సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది.
తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో పోలీసుల భారీగా మోహరించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్ టీడీపీలో హీట్ పుట్టిస్తోంది. మాజీ ఏఎంసీ చైర్మన్ రమేశ్ రెడ్డిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే  రాజీనామా చేస్తానని రెండు రోజుల క్రితం కొలికపూడి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 11 గంటలతో కొలికపూడి డెడ్ లైన్ పూర్తి అయింది. దీంతో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొలికపూడి తీరుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. ఇప్పటికే ఐవిఆర్ఎస్, ముగ్గురు సభ్యులతో కూడిన నివేదికను అధిష్టానం తెప్పించుకుందంట.

తిరువూరు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో 1994 నుంచి నల్లగట్ల స్వామిదాసు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు .. రెండు సార్లు ఎమ్మెల్యేగా  పనిచేశారు.. స్వామిదాసు గత ఎన్నికల ముందు కేశినేని నాని వెంట వైసీపీలో చేరడంతో టీడీపీకి అభ్యర్ధి కరువయ్యారు. దాంతో ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తన అన్న నాని టీమ్‌ని ఓడించడానికి కొలికపూడి పేరు అధిష్టానానికి సిఫార్సు చేశారు. కొలికిపూడి వాగ్ధాటి చూసి పార్టీకి పనికొస్తారని భావించి చంద్రబాబునాయుడు అతనికి టికెట్ ఇచ్చారు. కూటమి వేవ్‌లో కొలికపూడి మంచి మెజార్టీతో గెలిచారు.
అమరావతి ఉద్యమ నేతగా ఫోకస్ అయిన ఆయన్ని తిరువూరు ఓటర్లు అంతలా ఆదరిస్తే, గెలిచాక ఆయన తనలోని మరో కోణం చూపిస్తున్నారంట. 

తాజాగా కొలికపూడి తనకు రాజకీయ భిక్ష పెట్టిన కేశినేని చిన్ని అనుచరుడు రమేష్‌రెడ్డిని టార్గెట్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కొలికపూడి వ్యవహారం వైసీపీకి ఆయుధంగా మారుతోంది. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య కమిషన్ల పంచాయితీ సాగుతోందని,  వైసీపీ ఆరోపిస్తోంది. అందుకే పరోక్షంగా చిన్నిని కొలికపూడి టార్గెట్ చేస్తూ,  చిన్ని అనుచరుడైన రమేష్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హడావుడి చేస్తున్నారని వైసీపీ ప్రచారం మొదలు పెట్టింది. 

అదలా ఉంటే టీడీపీ శ్రేణుల్లో మరో వాదన కూడా వినిపిస్తోంది. ఏవో అవసరాల కోసం రమేష్‌రెడ్డిని కొలికపూడి అప్పుగా సాయం చేయమని కోరారంట. అయితే రమేష్‌రెడ్డి రియాక్ట్ అవ్వకపోవడంతో తిరువూరు ఎమ్మెల్యే కోపమొచ్చి కొత్త డ్రామా మొదలుపెట్టారంట. ఈ క్రమంలో టీడీపీలో కొలికిపూడికి బ్యాడ్‌టైమ్ స్టార్ట్ అయిందని... ఇక ఆయనకు పార్టీలో సీన్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో