కోర్టు బోనెక్కుతున్న... మన పండుగలు!

 

మన దేశంలో ప్రతీ యేడు కొన్ని పండగలు రాగానే మీడియాలో పాత హడావిడి మొదలైపోతుంది.పండగ శోభ గురించి, పండగ కోలాహలం గురించి, సంప్రదాయాలు, ఆచారాలు వగైరా వగైరా గురించి పేపర్లలో, ఛానల్స్ లో బోలెడు కథనాలు వస్తాయి. అయితే, విషాదంగా ఈ మధ్య కొన్ని పండుగలు రాగానే మీడియాలో కోర్టులు, కోర్టు తీర్పుల హడావిడి ఎక్కువైపోతోంది. ప్రతీ సంవత్సరం అదే తంతు. ఇది మరీ ముఖ్యంగా, హిందువుల పండుగలప్పుడే చర్చకు దారి తీసి రచ్చైపోతోంది... 


ప్రతీ వినాయక చవితికి పెద్ద దుమారం నిమజ్జనమే. కోర్టులు, ప్రభుత్వాలు హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు వేయవద్దని అనటం, వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులు మాత్రం ససేమీరా అనటం రోటీన్ అయిపోయింది. ఇందులో ఎవరు కరెక్ట్, ఎవరి సెంటిమెంట్ కరెక్ట్ ఆ వినాయకుడికే తెలియాలి! సరిగ్గా ఇలాంటి వ్యవహారమే సంక్రాంతి కోళ్ల పందాలు, జల్లికట్టు విషయంలో కూడా జరుగుతూ వస్తోంది. ఒకే సమస్య సంవత్సరం తరువాత సంవత్సరం వస్తూనే వున్నా ఎవ్వరూ గట్టిగా పూనుకుని పరిష్కారం చూపలేకపోతున్నారు. 


సంక్రాంతి వస్తే ఆంధ్ర ప్రాంతంలో కోళ్ల పందాలు జోరందుకుంటాయి. వీటిలో కోట్లకు కోట్లు చేతులు మారతాయి. పైగా మూగ జీవాలతో పాశవికమైన క్రీడ నడుస్తుంది. వాటి ప్రాణాలు బలిపెట్టి వినోదం పొందుతుంటారు. ఇవన్నీ కారణాల చేతే కోర్టు ఈ యేడు కోళ్ల పందాలు కుదరవని తేల్చేసింది. జంతు ప్రేమికులు సంతోషించారు. కాని, కోర్టుల నెపంతో హిందూ సంప్రదాయాలు, భారతీయ పురాతన ఆచారాలపై దాడి జరుగుతోందని కొందరు వాపోతున్నారు. నిత్యం చికెన్ షాపుల్లో లక్షల కోళ్లు నిర్ధాక్షిణ్యంగా అంతమైపోతుంటే కోళ్ల పందాలని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇందులోనూ పాయింట్ లేకపోలేదు! కోళ్ల పందాల విషయంలో కోర్టులు కూడా బెట్టింగుల మీద దృష్టి పెట్టాలిగాని ఆచారంగా వస్తోన్న కోళ్ల పందాలపై కాదనుకుంటా.


కోళ్ల పందాల మాదిరిగానే జల్లికట్టు కూడా ఎప్పటికప్పుడు కోర్టు మెట్లపై మూలుగుతోంది. తమిళనాడులో జరిగే ఈ ఎడ్ల పందెం జంతు ప్రేమికులకి సహజంగానే నచ్చలేదు. కోర్టుకు వెళ్లారు. సుప్రీమ్ జల్లికట్టు నిషేధించాల్సిందే అనేసింది. కాని, ప్రజల మనోభావాలతో ముడిపడ్డ ఈ వ్యవహారం తమిళ సర్కార్ కు, కేంద్ర సర్కార్ కు తలనొప్పిగా మారింది. వదలమంటే జనానికి కోపం, కరవమంటే కోర్టుకు కోపం అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ సంవత్సరం కూడా అత్యున్నత న్యాయస్థానం జల్లికట్టుకు పర్మిషన్ ఇవ్వటానికి అస్సలు అంగీకరిచంలేదు. పశువుల్ని హింసించటానికి వీల్లేదని చెప్పింది. కాని, కమల్ హాసన్ లాంటి సెలబ్రిటీలు మొదలు చాలా మంది తమిళులు జల్లికట్టు తప్పు కాదని వాదిస్తున్నారు. ఉత్తమమైన పశు సంతతి వృద్ధి కోసం ఈ ఎడ్ల పందాలు నిర్వహిస్తారని వారంటున్నారు. కాని, అదే విషయం సమర్థంగా కోర్టులో చెప్పేవారు లేదు. అందుకే, సుప్రీమ్ జల్లికట్టు నిషేధం దిశగానే మొగ్గు చూపుతోంది.


జల్లికట్టు నిషేధం వల్ల నష్టం, జరగటం వల్ల లాభం ఏదీ లేదు. కాకపోతే, అత్యధిక జనాభా తాలూకూ మనోభావాలకి సంబంధించిన విషయమైన ఒక అంశంపై తీర్పు ఇచ్చినప్పుడు కోర్టులు కూడా పునరాలోచిస్తే బావుంటుంది. ఎందుకంటే, స్పెయిన్ లాంటి దేశంలో బుల్ ఫైట్ చట్టబద్ధంగా నిర్వహిస్తుంటారు. అదెలా సాధ్యమవుతోందో అధ్యయనం చేస్తే మనకూ ఒక పరిష్కారం దొరకవచ్చు. కాని, జల్లికట్టు, కోళ్ల పందాలు, వినాయక నిమజ్జనం కేవలం తీర్పుల వల్ల, నిషేధాల వల్ల మాత్రం ఆగేవి కావు. సామాన్య జనంలో చైతన్యం వస్తే తప్ప అవ్వి తమంత తాముగా ఆగవు. అంతే కాని, కోర్టు ఆర్డర్ తో ప్రభుత్వాలు తూచా తప్పక అమలు చేసే అవకాశం ఎంత మాత్రం లేదు. కారణం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలన్నీ జనం వేసే ఓట్ల మీదే  ఆధాపడి వుంటాయి. వాటికి లోటు వచ్చేలా చర్యలు అవ్వి ఏనాడూ తీసుకోవు. ఈ మొత్తం వ్యవహారానికి షరతులతో కూడిన అనుమతి ఒక్కటే సమర్థనీయ మార్గం...