జాతిని రక్షించే జవానుకి... జవాబు చెప్పుకోవాల్సిందే!

posted on: Jan 13, 2017 11:57AM

 

దేశం లోపల వుంటూ మన ప్రాణాలు కాపాడేది రైతు. ఆ రైతులకి ఇప్పుడు దక్కుతోన్నగౌరవం, రక్షణ ఎంతో మనకు బాగా తెలుసు. ఇక దేశపు సరిహద్దుల్లో వుంటూ మన ప్రాణాలు కాపాడేది జవాన్. కిసాన్ అన్నం పెడితే జవాన్ మనం హాయిగా ఆ అన్నం తిని నిద్దురపోయేలా చూస్తాడు. అంతటి ప్రాముఖ్యం వుంది కాబట్టే మన దేశం ప్రతీ యేడూ లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది దేశ రక్షణ రంగంపై. కాని, తాజా పరిణామాలు ఆ లక్షల కోట్లు వృథా అవుతున్నాయేమో అనేలా వున్నాయి...

 

ఈ మధ్య వరుసగా బీఎస్ఎఫ్ జవాన్ల వీడియోలు ఇంటర్నెట్ లో కలకలం రేపుతున్నాయి. ఒక వీడియోలో ఒక జవాను జీతాల విషయంలో తాము ఎదుర్కొంటోన్న వివక్ష గురించి మాట్లాడితే మరో దాంట్లో ఇంకో జవాను తమకు శరీరం గడ్డ కట్టే చలిలో ఏర్పాటు చేస్తోన్న అద్వాన్నమైన భోజనం గురించి గొంతు విప్పాడు. ఇక అత్యంత తాజాగా మరో జవాను తన పై అధికారులు పెడుతోన్న టార్చర్ గురించి మాట్లాడాడు. తాను ప్రధానికి తమ సమస్యల గురించి లేఖ రాస్తే కక్ష సాధింపు మొదలైందని వాపోయాడు. అధికారులు కోర్టు మార్షల్ చేసే ఉద్దేశంతో వున్నారని అన్నాడు. ఇంతకీ ఆ జవాను ప్రధాని దృష్టికి తీసుకొచ్చిన సమస్యలేంటి? అధికారులకి బూట్లు పాలిష్ చేయటం లాంటి అమానుష పనులు తమ  చేత చేయించవద్దన్నాడు!

 

దూరపు కొండలు నునుపు అన్నట్టు మనకు అంతా క్రమశిక్షణతో కదిలిపోతున్నట్టు కనిపిస్తుంది కాని.. పోలీస్ మొదలు ఆర్మీ వరకూ భద్రతా దళాలు అన్నిట్లో దారుణమైన బాసిజమ్ వుంటుంది. దిగువ స్థాయి వార్ని పై వారు , వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా హింసిస్తుంటారు. తమ కుటుంబాలకి దూరంగా వుండే జవాన్లు, పోలీసులు అనేక సార్లు ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు, కాల్పులు జరపటం వంటి విషాదాలకి కారణం అవుతుంటారు. చాలా సార్లు భద్రతా దళాల్లో వుండే కరుడుగట్టిన క్రమశిక్షణ వల్ల అంతకన్నా వేరు మార్గం వుండదు. కాని, తాజాగా వీడియోల రూపంలో జవాన్లు తమ అసంతృప్తి బయట పెడుతున్నారు. ఇది ఆందోళనకరమే అయినా అసలు పరిస్థితిని కళ్లకు కడుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్ర దర్యాప్తు, విచారణకు ఆదేశించి ప్రక్షాళన చేపట్టాలి. ఊరికే లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆయుధాలు, అణు బాంబులు సిద్ధం చేసుకుంటే యుద్ధాలు గెలిచేయం. శత్రువు కన్నులో కన్ను పెట్టి పోరాడే సిపాయి మనస్ఫూర్తిగా సిద్ధంగా వుండాలి. అప్పుడే దేశం భద్రంగా వున్నట్టు. గన్నులు, బుల్లెట్లు,మిసైల్స్, బాంబుల వంటి వాటి కోసం కోట్లు ఖర్చు చేసే మన వ్యవస్థ ఒక జవానుకు చల్లటి చలిలో ఆరోగ్యకరమైన ఆహారం అందివ్వలేకపోతోందంటే .. చాలా పెద్ద లోపమే ఎక్కడో జరుగుతోందని అర్థం. దాన్ని వెదికి పట్టుకుని హతమార్చితేనే ఈ అంతర్గత యుద్ధంలో మనం గెలిచేది! బయటి శత్రువులతో యుద్ధానికి సర్వ సన్నద్ధంగా వుండగలిగేది!

google-ad-img
    Related Sigment News
    • Loading...