జగన్‌కు కలిసిరాని జనవరి 11

 

జనవరి 11 జగన్‌కు ఏమంత అచ్చి వచ్చినట్లు కనిపించడం లేదు. ఈ రోజు జరిగిన ఓ రెండు సంఘటనలు ఆయన రాజకీయ జీవితానికి మరింత విఘాతం కలిగించేలా ఉన్నాయి. పులివెందులకి కృష్ణా నీటి విడుదల వీటిలోని మొదటి అంశం. కొన్ని దశాబ్దాలుగా పులివెందుల వైఎస్సార్‌ కుటుంబానికి కంచుకోటగా నిలిచింది. జగన్‌ తాతయ్య రాజారెడ్డి నాటి నుంచి రాయలసీమ మీద పట్టుసాధించేందుకు పులివెందుల నియోజకవర్గం వారికి అండగా నిలిచారు. అదే పులివెందలులలో పైడిపాళెం ప్రాజెక్టుకి నీటిని అందించడంతో క్రమేపీ టీడీపీ కడప జిల్లా మీద తన పట్టుని విస్తరించినట్లయ్యింది. పులివెందులకి నీరు అందేదాకా మొక్కు తీయనని దీక్షపట్టిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీశ్‌ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నట్లయ్యింది.

 

ఇంతేకాదు! తెదెపా ప్రతిష్టాత్మకంగా చేపడతున్న సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులలో రాయలసీమకు కూడా తగిన వాటాను కేటాయిస్తున్నారు. దీని వెనుక అక్కడ జగన్‌ ప్రాబల్యాన్ని తగ్గించడమే లక్ష్యమని కూడా చెబుతున్నారు. మరోవైపు రాయలసీమ వెనకబడుతోందంటూ వేర్పాటువాదానికి ప్రయత్నిస్తున్న నేతలని కూడా ఈ ప్రాజెక్టులతో అడ్డుకున్నట్లు అవుతోంది. నిన్న గండిపెట ఎత్తిపోతల పథకం నుంచి పైడిపాళెం రిజర్వాయరుకు నీటిని మళ్లించిన ప్రభుత్వం ఈ రిజర్వాయరుకు ఎన్టీఆర్‌ పేరు పెట్టడం మరో ఆసక్తికరమైన ఆంశం. దీంతో వైకాపాకు సహజంగానే పుండు మీద కారం చల్లినట్లయ్యింది. అందుకనే చంద్రబాబు రాయలసీమ పట్ల ప్రేమ ఉన్నట్లు నాటకం ఆడుతున్నారని తీవ్రంగా విరుచుకుపడింది. తాము చేపట్టిన ప్రజెక్టులకు చంద్రబాబు గేట్లు ఎత్తుతున్నారంటూ ఎద్దేవా చేసింది. పైడిపాళెం రిజర్వాయరు ప్రారంభోత్సవం సందర్భంగా తెదెపా నేత జే.సీ.దివాకరరెడ్డి, జగన్‌కు వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే... తెదెపా తన దూకుడుని పెంచినట్లే కనిపిస్తోంది.

 

ఇక జగతిలో పెట్టుబడి పెట్టిన మరో రెండు బోగస్ కంపెనీల గురించి సీబీఐ విచారణ సాగించడం జగన్‌కు మింగుడుపడని మరో అంశం. ఇప్పటికే తన తండ్రి హయాంలో ప్రాజెక్టులు కేటాయించినందుకుగాను వచ్చిన అడ్డగోలు లంచాలన్నింటినీ జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్ వంటి సంస్థల్లోకి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. నల్లధనాన్ని ఇలా పెట్టుబడులుగా మార్చుకునేందుకు బోగస్ కంపెనీలు ఎన్నింటినో సృష్టించారనీ తేలింది. తాజాగా వాటిలో మరో రెండు కంపెనీల భాగోతం కూడా బయటపడింది. సరైన చిరునామా కూడా లేని భాస్కర్‌ ఫండ్‌ మేనేజ్మెంట్‌, డెల్టన్‌ కంపెనీ అనే సంస్థలు జగతిలో వాటాలను కొనుగోలు చేసినట్లు తేలింది. మాయావతి తమ్ముడైన ఆనంద్‌కుమార్ భాగోతాలను తవ్వి తీస్తుంటే ఈ చిత్రం కూడా బయటపడింది.

 

వైఎస్‌ఆర్‌ హయాంలో జగన్‌ ఎలాగైతే కోట్లకి పడగలెత్తారో... మాయావతి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, సదరు ఆనంద్‌కుమార్ కూడా కుబేరునిగా మారిపోయారు. ఈ క్రమంలో ఆయన ఆస్తులు 7 కోట్ల నుంచి 1300 కోట్లకు చేరుకున్నాయంటేనే తెలుస్తోంది, ఆయన తన ఆస్తులను ఎంత సజావుగా సంపాదించారో తేలిపోతోంది!

 

ఇప్పటికే జగన్ వెంట సమర్థులైన నాయకులు ఎవరూ మిగల్లేదు. మైసూరారెడ్డి, భూమానాగిరెడ్డి వంటి పెద్దన్నలందరూ పార్టీని వీడిపోయారు. తెదెపా ఆకర్షణకి ఆ పార్టీ ద్వారా ఎన్నికైన శాసనసభ్యులు సైతం ఒకొక్కరుగా సైకిలెక్కేస్తున్నారు. ఇటు ED, IT, CBI వంటి శాఖలన్నీ జగన్ ఆస్తుల మీద పట్టు బిగిస్తున్నాయి. ఇన్ని కష్టాలలోనూ రాయలసీమవాసులు తనకి అండగా ఉన్నారనే ధైర్యం జగన్‌ది. మరి ఆ రాయలసీమ మీద అతని పట్టు కూడా చేజారిపోతే... భవిష్యత్‌ అగమ్యగోచరమే!