వివేకా హత్యపై కడప కోర్టు ఆర్డర్ పై సుప్రీం స్టే
posted on May 17, 2024 3:39PM
వివేకా హత్య కేసుపై ఎన్నికలు పూర్తయ్యే వరకూ మాట్లాడవద్దంటూ కడప హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కడప కోర్టు తన ఉత్తర్వులలో డాక్టర్ సునీత , షర్మిల సహా కొందరు విపక్ష నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ వారెవరూ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా వివేకా హత్య కేసు విషయాన్ని ప్రస్తావించకూడదంటే ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
కడప కోర్టు ప్రస్తావించిన విపక్షాల నేతలలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి తదితరులు ఉన్నారు. వీరెవరూ కూడా ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ వివేకా హత్య కేసు గురించి మాట్లాడకూడదంటూ కడప కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే కడప కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కడప కోర్టు ఉత్తర్వ్యులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సుప్రీం కోర్టు కడప కోర్టు ఉత్తర్వ్యులపై స్టే విధించింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ షర్మిల పిటిషన్ ను విచారించి కడప కోర్టు ఉత్తర్వ్యులపై స్టే విధించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కడప కోర్టు న్యాయమూర్తి కనీసం డిఫెండెంట్ల వాదనను కూడా వినకుండా తీర్పు వెలువరించిందని పేర్కొంది. కడప కోర్టు మేజిస్ట్రేట్ తీర్పు భావప్రకటనా స్వేచ్ఛను హరించేదిగా ఉందని వ్యాఖ్యానించింది. డిఫెండెంట్ల వాదన వినకుండానే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, కేసు విచారణను వాయిదా వేయడాన్ని తప్పుపట్టింది.