తమిళ హీరో విజయ్ రాజకీయ పార్టీకి ఈసీ గుర్తింపు

తమిళనాడు అగ్రహీరోలలో ఒకరైన దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన తన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ఆయన పార్టీకి అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. తమిళనాట విశేష ప్రేక్షకాభిమానం, అసంఖ్యాక అభిమానుల బలం ఉన్న దళపతి విజయం తమిలగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ విషయాన్ని టీవీకే సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించింది. 

ఎన్నికల సంఘం అధికారిక గుర్తింపు కోసం ఫిబ్రవరి 2న దరఖాస్తు చేసుకున్నట్లు టీవీకే పేర్కొంది. ఆ దరఖాస్తును పరిశీలంచి కేంద్ర ఎన్నికల సంఘం పార్టీకి అధికారికంగా గుర్తింపు ఇచ్చిందని పేర్కొన్న టీవీకె ఇక నుంచి పార్టీ రాజకీయ కార్యకలాపాలను విస్తతం చేయనున్నట్లు తెలిపింది. 
కాగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పార్టీ ముందు ముందు సాధించబోయే విజయాలకు తొలి అడుగుగా టీవీకే అధినేత దళపతి విజయ్ పేర్కొన్నారు. పార్టీని ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన దళపతి విజయం ఆ సమయంలోనే తన పార్టీ కుల రహిత, అవినీతి రహిత సమాజం కోసం పోరాడుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.  

ఇటీవలే దళపతి విజయ్ తన పార్టీ జెండానూ, చిహ్నాన్ని ఆవిష్కరించారు. టీవీకే జెండాలో పైన ఎరుపు రంగు, మధ్యలో పసుపుపచ్చ రంగు, కింద కాషాయ రంగు ఉండగా. .  జెండా  మధ్యలో వాగాయ్‌ అనే పువ్వు, దానికి ఇరువైపులా ఏనుగులు ఉన్నాయి. అలాగే జెండాపై ప్రముఖ తమిళ కవి తిరువళ్ళువర్‌ రాసిన ‘పిరపోక్కుమ్‌ ఎల్ల ఉయుర్కుమ్‌’ అనే కొటేషన్‌ కూడా ఉంది. ‘పుట్టుకతో అందరూ సమానమేఅనేది ఈ కొటేషన్ సారాంశం. ఆ కొటేషన్ తో తన పార్టీ కుల రహిత సమాజం కోసం పోరాడుతుందన్న సందేశాన్ని బలంగా చాటారు విజయ్.   తన రాజకీయ పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పని చేస్తుందని విజయ్ పేర్కొన్నారు.  అప్పటి వరకూ రాజకీయ కార్యకలాపాలలో విస్తృతంగా, విరివిగా పాల్గొనడం ద్వారా పార్టీని విస్తరించాలన్నది విజయ్ వ్యూహంగా కనిపిస్తున్నది.