బుడమేరు పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ!

విజయవాడను సగం ముంచేసిన బుడమేరు ఇంకా శాంతించలేదా? చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు ఉప్పొంగి ప్రవహించింది. సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిలువులోతు వరద నీటిలో ప్రజలు నానా ఇబ్బందులూ పడ్డారు. గత వారంరోజులుగా ఇంకా పలు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి.

భారీ వర్షాలతో బుడమేరు ప్రవాహం అనూహ్యంగా పెరగడంతో మూడు చోట్ల గండ్లు పడటం కూడా ఈ పరిస్థితికి కారణం. కాగా ప్రభుత్వం అవిశ్రాంతంగా పని చేసి గండ్లను విజయవంతంగా పూడ్చివేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు వారం రోజులు బడమేరు ఒడ్డునే ఉండి స్వయంగా గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించారు. రెండు గండ్లను విజయవంతంగా పూడ్చేసినా మూడో గండి పూడ్చివేతకు ఆర్మీని రంగంలోకి దింపాల్సి వచ్చింది. మొత్తానికి మూడో గండి పూడ్చివేత కూడా పూర్తయ్యింది. ఇక వరద ముంపు భయంలేదని అంతా భావిస్తున్న వేళ బుడమేరు మళ్లీ భయపెడుతోంది.

 స్థిరంగా కురుస్తున్న వర్షాల కారణంగా బుడమేరులో ప్రవాహం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం బుడమేరు పరిసరప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బడమేరు పరిసర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న  వర్షాల కారణంగా బడమేరు మళ్లీ ప్రమాదకరంగా ప్రవహిస్తోందనీ, పరిసర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన కోరారు. ముఖ్యంగా గుణదల, సింగ్ నగర్ ప్రజలు సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన సూచించారు. వర్షాలు తగ్గేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.