జగన్ చీకటి జీవోలన్నీ పబ్లిక్ డొమైన్ లోకి!

జగన్ పాలనలో పారదర్శకత అన్నది దేవతావస్త్రమే అన్నట్లుగా పరిస్థితి ఉండేది.  జగన్ చెప్పే మాటల్లో, పాలనలో ఎక్కడా పారదర్శకత కనిపించేది కాదు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉత్తుత్తి ఆదేశాలు ఇచ్చేవారు. ఆ సంగతి తెలుసు కనుక అధికారులు జగన్ ఆదేశాలను ఇసుమంతైనా పట్టించుకునే వారు కాదు.  ప్రభుత్వం జీవోలు విడుదల చేసేది కానీ అవి ఎవరికీ ఎక్కడా కనిపించేవి కావు.   కోర్టులకు మాత్రం తమ ప్రభుత్వం అత్యంత పాదర్శ కంగా పాలన సాగిస్తోందని చెప్పుకునేది. కానీ ఆచరణలో మాత్రం అందుకు పూర్తి  విరుద్ధంగా వ్యవహరించేది.  

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ఇదేళ్ల పాలనా ఇలాగే సాగింది.   జగన్ హయాంలో ప్రభుత్వం ఎన్నో రహస్య జీవోలను ఇచ్చింది.  ప్రతి జీవో పబ్లిక్ డొమైన్ లో ఉండాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించేది. జగన్ ఐదేళ్ల పాలనలో జీవోలన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉండాలన్న ఆదేశాలను కనీసం నాలుగు సార్లు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలు జగన్ అధికారంలో ఉన్నంత కాలం అమలు కాలేదు. అంటే జగన్ ఉత్తుత్తి ఆదేశాలు ఇచ్చారన్న మాట.  ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  కీలక నిర్ణయం తీసుకుంది. ఇంత కాలం రహస్యంగా ఉంచిన జగన్ హయాంలోని జీవోలన్నిటినీ పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని నిర్ణయించింది. ఆ రహస్య జీవోలన్నిటినీ జీఓఐఆర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయించాల‌ని నిర్ణ‌యించింది.  2021 ఆగ‌స్టు 15 నుంచి 2024 ఆగ‌స్టు 28 వ‌ర‌కూ ర‌హ‌స్యంగా ఉంచిన అన్ని జీవోలనూ   ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ మేరకు ఇంత కాలం గోప్యంగా ఉన్న జీవోలన్నిటినీ  ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచాల‌ని ఉత్తర్వులు జారీ చేసింది.  జీఓఐఆర్ వెబ్‌సైట్‌  ప్రారంభ‌మైన 2008 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అన్ని జీఓలు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ,  వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో 2021 ఆగ‌స్టు 15 నుంచి 2024 ఆగ‌స్టు 28 వ‌ర‌కు జారీ అయిన  జీఓలు మాత్ర‌మే అందుబాటులో లేవ‌ని సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ వెల్ల‌డించింది. ఇప్పుడు వాటన్నిటినీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.