రోజాకు కొత్త నొప్పులు

ఆర్కే రోజాకు ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రిగిరి ఏమో కానీ.. రానున్న ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అయ్యి.. అసెంబ్లీలో అడుగు పెట్టే యోగం ఉందో లేదోననే సంశయం అయితే ఆమెలో గట్టిగా గూడు కట్టుకొందని సమాచారం. ఇప్పటికే నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఓ వైపు మంత్రి పెద్దిరెడ్డి సమస్య, మరోవైపు అయిదు మండలాల ఫ్యాన్ పార్టీ నేతల్లో తనపై వ్యతిరేకత సమస్య, ఇంకో వైపు నియోజకవర్గంలో తమిళల సమస్యలు తీర్చలేకపోతున్నాననే సమస్య, తాజాగా టాలీవుడ్‌లో ఒక నాటి హీరోయిన్ వాణి విశ్వనాథ్ సమస్య... స్వపక్షంలోనే రోజాకు విపక్ష సమస్యలు.. ఇలా వరుస సమస్యలతో ఆర్కే రోజా సతమతవుతోందనే టాక్ అయితే ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సందర్బంగా రోజా రాజీనామా చేసి.. గెలవాలంటూ.. ప్రతిపక్ష టీడీపీ సభ్యులు సవాల్ విసిరారు. వాళ్లు అలా అన్నారో లేదో.. ఇలా రోజా సొంత నియోజకవర్గం నగరిలో వాణి విశ్వనాథ్ ప్రత్యక్షమై.. స్థానిక కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లతో కలిసి కలియ తిరిగారు. అంతేకాదు..స్థానిక  ఒకటో వార్డులోని గ్రామ దేవత సామాలమ్మకు వాణి విశ్వనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించి.. రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలబడుతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తానో తెలియదు కానీ.. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా రానున్న ఎన్నికల బరిలో దిగుతానంటూ ఆమె ప్రకటించడం హాట్‌ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. తాను తమిళియన్ అని.. తన అభిమానులు ఈ నియోజవకర్గంలో చాలా మందే ఉన్నారని, ఈ నగరిలోనే తన అమ్మమ్మ నర్సుగా పని చేసిదంటూ నగరితో తనకు ఉన్న కనెక్షన్స్ అన్ని వాణి విశ్వనాథ్ ఈ సందర్బంగా బయటపెట్టేసింది.

అయితే గతంలో ఆర్కే రోజాకు పోటీగా వాణి విశ్వనాథ్ అభ్యర్థిత్వాన్ని తెలుగు దేశం పార్టీ పరిశీలించింది. ఆమెను టీడీపీలోకి తీసుకోవాలని కూడా ఆ పార్టీలోని కీలక నేతలు సైతం నిర్ణయించారు. కానీ చివరి నిమిషంలో అది కాస్తా వాయిదా పడింది. అంతేకాదు.. ఆమె సైకిల్ పార్టీలో సవారీ చేసేందుకు ఆసక్తి కూడా కనబరిచారు. కానీ అంతలోనే ఏమైందో ఏమో.. ఆమె సైలెంట్ అయిపోయారు. కానీ మళ్లీ ఎన్నికల వేడి రాజుకొంటోంది. అలాంటి సమయంలో వాణి విశ్వనాథ్ నగరిలో ప్రత్యక్షం కావడం చిత్తూరు జిల్లాలో హాట్ హాట్ న్యూస్‌ అయింది. మరోవైపు నగరి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయనే ఇక్కడ నుంచి బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఆ పార్టీ తెర చాటు రాజకీయంలో భాగంగా ముందుగా వాణి విశ్వనాథ్‌ను రంగంలోకి దింపినట్లు సమాచారం. నగరిలో తమిళ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. సదరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపులో వీళ్ల ఓట్లే కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో రోజాకు వ్యతిరేకంగా వాణి విశ్వనాథ్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.  రానున్న ఎన్నికల్లో నగరి నియోజవర్గంలో స్టార్ వారు తప్పేదా లేదు.

1980వ దశకం మద్య కాలం నుంచి 1990వ దశకంలో కూడా వాణి విశ్వనాథ్ టాలీవుడ్‌లోని పలు చిత్రాలో హీరోయిన్‌గా నటించారు. తెలుగు ప్రజల మనస్సులో ఆమెకు మంచి స్థానం ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఘరానా మొగుడు. ఈ చిత్రంలో అందం, అభినయం కలగలిసిన వాణి విశ్వనాథ్‌తో చిరంజీవి వాన పాటకు వేసిన స్టెప్లులకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఫిదా అయిన సంగతి తెలిసిందే.