పొత్తు పొడుపుల రంధి ఏల.. జనక్షేత్రంలో తేల్చుకుంటే పోలా..!

ఏపీలో ప్రస్తుతానికి పొత్తుల చర్చకు విరామమే. జగన్  పాలనను జన క్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేనలు వేర్వేరుగా ప్రణాళికలు, వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. పొత్తులపై చర్చలు, సంప్రదింపులు అన్నీ జనం మూడ్ ను బట్టేనన్న స్పష్టమైన అవగాహనతో తెలుగుదేశం జనసేనలు ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. జన సేన అయితే బీజేపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నామన్న సంకేతాలను ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీని పక్కన పెట్టి ఏపీలో రాజకీయ హడావుడి జోరందుకుంది. ముందస్తు ఎన్నికలు తథ్యమన్న అంచనాలతో రాజకీయ నాయకులు ప్రజా క్షేత్రంలోకి వెళుతున్నారు. జనం నాడిని పట్టుకోవడం, ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంతో పాటు ఇప్పటికే ప్రజలలో గూడుకట్టుకుని ఉన్న ప్రజా వ్యతిరేకతను అలాగే కొనసాగేలా ఉంచడం, మరింత పెంచడం లక్ష్యంగా పార్టీల నాయకుల పర్యటనలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత తన రాష్ట్ర వ్యాప్త పర్యటనను నిరాటంకంగా ఏడాది పాటు కొనసాగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంటే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరు నెలల పాటు బస్సు యాత్ర పేరిట జనంలో ఉండాలని నిర్ణయించుకున్నారు.

చంద్రబాబు పర్యటనలకు రూట్ మ్యాప్ ఇప్పటికే ఖరారు అయ్యింది. తెలుగుదేశం శ్రేణులు తమ అధినేత పర్యటన ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. వేసవి ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఇక రాజకీయ వేడి పెంచేయడమే లక్ష్యంగా చంద్రబాబు జగన్ పాలనపై చంద్ర నిప్పులు చెరుగనున్నారు. పవన్ కల్యాణ్ కూడా జగన్ పాలన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్న విమర్శలతో చెలరేగనున్నారు. నిన్న మొన్నటి దాకా పొత్తు పొడుపులు, షరతులు, ఆప్షన్స్ అంటూ జరిగిన చర్చకు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఫుల్ స్టాప్ పెట్టేశాయనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జగన్ పాలనకు చరమగీతం అన్న ఏకైక అజెడాతో తెలుగుదేశం, జనసేన పార్టీలు వేటికవే వేర్వేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి. ఈ నెల 15 నుంచి చంద్రబాబు రాస్ట్ర పర్యటన ప్రారంభం కానుంది. గతంలో మీకోసం పాదయాత్రలో చంద్రబాబు రాష్ట్ర వ్యమాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అప్పట్లో కవర్ చేయని ప్రాంతాలను కూడా ఈ సారి యాత్రలో కవర్ చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు తన పర్యటన ప్రణాళిక రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక నెలలో రెండు లేదా మూడు జిల్లాలలో పర్యటించే విధంగా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఆ సందర్భంగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. అలాగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి జిల్లాలోనే మినీ మహానాడు నిర్వహించి తద్వారా కార్యకర్తలలో ఉత్సాహం నింపేలా వ్యూహం రూపొందిచారు. ఈ విధంగా ఏడాదిలో మొత్తం 80 నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటించనున్నారు.

అదే సమయంలో పార్టీ కార్యకలాపాలకు ఏ విధంగానూ అవరోధం కలగకుండా సమాంతరంగా ఆ పనులు కూడా నిర్వహించేలా సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.  అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఏకబిగిన ఆరు నెలల పాటు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలలో ఎండగట్టాలని నిర్ణయించారు. బీజేపీతో మైత్రికి ఇక చెల్లు చీటీయేనని జనసేనాని దాదాపుగా ఒఖ నిర్ణయానికి వచ్చేసినట్లు ఆయన  తీరును బట్టి అవగతమౌతుంది.  ఆ నేపథ్యలోనే బీజేపీతో చెలిమిని పక్కన పెట్టి తిరుపతి నుంచి తన రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి పవన్ యాత్ర ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 5 దసరా నుంచి పవన్‌ పర్యటన తిరుపతి నుంచి ప్రారంభం కానుంది   ఆరునెలల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటన సాగేలా జనసేన శ్రేణులు షెడ్యూల్ రూపొందిస్తున్నాయి. 

ఏపీలో విపక్షాల మధ్య పొత్తు వ్యవహారం కూడా టీడీపీ-జనసేన అధినేతల పర్యటన తర్వాత ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. తమ పర్యటనల్లో జనం నాడి, ప్రభుత్వంపై ప్రజల స్పందన, తమ పార్టీ బలాబలాలు బేరీజు వేసుకున్న తర్వాతనే రెండు ప్రధాన పార్టీలూ పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అధినేతల బహిరంగసభలకు వచ్చే ప్రజల స్పందన, ఆయా పార్టీ నేతల బలనిరూపణ వంటి అంశాలు పరిశీలించిన తర్వాత పొత్తులపై పూర్తి స్పష్టత రానుంది. ఏపీలో రాజకీయం పార్టీల కార్యాలయాలను వదిలి ప్రజాక్షేత్రంలో పరీక్షకు నిలబడుతోంది.