జనసేనాని బ్యాలెన్స్ తప్పుతున్నారా?
posted on Mar 16, 2025 6:28AM

తెలుగు తమ్ముళ్ల చురకలు
ఎన్నికల ముందు తన పార్టీ మీటింగుల్లో పవన్ కళ్యాణ్ చాలా మాటలు మాట్లాడారు. మనకు ఆర్థిక, అంగ బలాలు, టీడీపీ స్థాయిలో గ్రౌండ్ లెవల్ నెట్‌వర్క్ లేవు, పోల్ మేనేజ్‌మెంట్ కూడా తెలియదు అందుకే జనసేన స్థాయికి తగ్గట్లు 21 స్థానాలకే పరిమితం అవుతున్నామని జనసైనికులకు వివరించారు.ఆ మాటలు పవన్ మరచిపోయినట్టున్నారు. రోజులు గడిచే కొద్దీ డిప్యూటీ సీఎం బ్యాలెన్స్ తప్పుతున్నట్లు కనిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టానని పవన్‌కళ్యాణ చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. కాన్ఫిడెన్స్ లెవల్స్ మరీ ఎక్కువై పోయాయని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రావణుడి లాంటి దుష్టుడిని మట్టుపెట్టడానికి రామ - సుగ్రీవులు కలిశారు . అలాంటి వానర సైన్యం లేకపోతే సీతారాములు కలిసేవారు కాదు అనుకుంటే పొరపాటే అని యద్దేవా చేస్తున్నారు .
బాబుగారు ఒదిగి వున్నారు కదా అని అంతా మేమే చేసాం, అంతా మా ఘనతే అనకండని చురకలు అంటిస్తున్నారు. మీకు కృతజ్ఞత ఉంటే మీ కోసం సీటు త్యాగం చేసిన వర్మకి ఎమ్మెల్సీ వచ్చేలా చేసేవారని చురకలు అంటిస్తున్నారు. ఈ సందర్బంగా పాత ఎన్నికల లెక్కలు బయటకు తీసి మీ సత్తా ఇదీ అని జనసేనానికి గుర్తు చేస్తున్నారు.
2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్, జనసైనికుల ఫ్యాక్టర్స్‌తో గాజువాకలో జనసేనకు వచ్చిన ఓట్లు 58,539. అప్పుడు తెలుగుదేశం అభ్యర్ధికి పల్లా శ్రీనివాసరావు గారికి వచ్చిన ఓట్లు 56,642. 75,292 ఓట్లు దక్కించుకున్న వైసీపీ 16,753 ఓట్ల మెజార్టీతో గట్టెక్కింది. 2024లో తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాస రావుకి వచ్చిన ఓట్లు 1,57,703. వైసీపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 62,468. ఒకవేళ జనసేన లేకుండా టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఇప్పుడొచ్చిన ఓట్లలో గతంలో జనసేనకు వచ్చిన ఓట్లు తీసేసినా టీడీపీకి 99,164 ఓట్లు దక్కేవి. ప్రస్తుతం తెలుగుదేశం అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 95,235. అందులో 2019 నాటి జనసేన షేర్ 58,539 తీసేస్తే తక్కువలో తక్కువ 35 వేలు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చేది.
2019లో పీఠాపురంలో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 28,011. టీడీపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 68,467. వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 83,459. 2024లో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 1,34,394. వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 64,115 . ఒకవేళ టీడీపీ ఇక్కడ మద్దతు ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండి ఉంటే 1,34,394 - 68,467= 65,927 ఓట్లు జనసేనకు దక్కేవి. అప్పుడు పవన్‌కళ్యాణ్‌కి 10 వేల లోపే మెజారిటీ దక్కేది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యేని చేర్చుకుని గెలిచిన భీమవరం లెక్కలు కూడా తీయవచ్చు కాని, చదివేవారికి బోరు కొడుతుంది వద్దులే. ఫ్యాక్టర్స్ మాట్లాడే ముందు ఫ్యాక్ట్ తెలుసుకో..మిడిసిపడే దీపం ఎక్కువసేపు వెలగదు.. అని తెలుగు తమ్ముళ్లు ఉప ముఖ్యమంత్రికి హితబోధ చేయడం మొదలుపెట్టారిప్పుడు.